బాల్కొండ, జనవరి 8: మండల కేంద్రంలోని గ్రంథాలయం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. లైబ్రరీ వద్ద ప్రతిరోజూ రాత్రిపూట కొందరు మద్యం సేవిస్తూ సీసాలు అక్కడే పడవేసి వెళ్లిపోతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రభుత్వ దవాఖాన పక్కన.. జడ్పీ పాఠశాల వద్ద ఉన్న గ్రంథాలయం వద్ద మద్యం సేవించడంతో స్థానిక యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా నిత్యం యువతీ యువకులు అధిక సంఖ్యలో లైబ్రరీకి వచ్చి చదువుకుంటున్నారు. ఉదయం లైబ్రరీలో పనిచేసే మహిళా సిబ్బందికి తాగి పడేసిన ఖాళీ మద్యం సీసాలు లైబ్రరీ పరిసరాల ఆవరణలో దర్శనమిస్తున్నాయి. వాటిని రోజూ తొలగించేందుకు మహిళా సిబ్బందికి తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. చదువుకునేందుకు వచ్చి పోయే యువతీ యువకులు సైతం ఇబ్బందికి గురవుతున్నారు. పోలీసులు రాత్రి వేళల్లో నిఘా ఏర్పాటు చేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని పాఠకులు కోరుతున్నారు.
ఇబ్బందిగా ఉంది
బాల్కొండ లైబ్రరీకి ఇన్చార్జిగా పనిచేస్తున్నాను. వారానికి రెండుసార్లు సోమవారం, బుధవారం బాల్కొండకు వస్తుంటా. ఉదయం లైబ్రరీకి రాగానే ఖాళీ మద్య సీసాలు పడి ఉంటున్నాయి. పోలీసులుగానీ గ్రామపంచాయతీ సిబ్బంది గానీ రాత్రి వేళలో నిఘా ఏర్పాటు చేస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇక్కడ మరుగుదొడ్లు కూడా లేవు. వచ్చే పాఠకులకు ఇబ్బందిగా ఉంది. వాటిని కూడా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నిరు.
– వాణి, లైబ్రేరియన్, బాల్కొండ