కమ్మర్పల్లి, జనవరి 29 : మహిళా సంఘాల స్వ యం సమృద్ధికి ప్రభుత్వం ఇతోదికంగా చేయూత అందిస్తున్నది. సంఘాల ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తూ మహిళల ఆదాయాభివృద్ధికి అవకాశాలు కల్పిస్తున్నది. వారికి ఆర్థిక భరోసానూ అందిస్తూ వ్యాపార, వ్యవసాయ, తదితర అవసరాల రుణాలను అందిస్తూ అండగా నిలుస్తున్నది. కొత్త రుణాలతో పాటు పొందిన రుణాలతో నెలకొల్పిన వ్యాపారాల అభివృద్ధికి రుణాలను అందిస్తూ మహిళల్లో ఆర్థిక సాధికారతను ఆవిష్కరించే కృషిని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరంగా సెర్ప్-ఐకేపీ ద్వారా కొనసాగిస్తున్నది.
పెద్ద ఎత్తున బ్యాంకు లింకేజీ రుణాలు
నిజామాబాద్ జిల్లాలో రుణాల పంపిణీ పెద్ద ఎత్తున జరుగుతున్నది. ప్రత్యేకించి ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో మునుపెన్నడూ లేనన్ని రుణాల పంపిణీ సాగుతున్నది. ప్రభుత్వం మహిళల కోసం పెద్ద ఎత్తున అందజేస్తున్న ఆర్థిక, వ్యాపార, ఆదాయాభివృద్ధి రుణాలను అంతే వేగంగా, అదే చిత్తశుద్ధితో చేరవేస్తే మరిన్ని సత్ఫలితాలు వస్తాయి. ఈ లక్ష్యంతో జిల్లా ఉన్నతాధికారులు, సెర్ప్ జిల్లా, ఆయా మండలాల అధికారులు, సిబ్బంది పంపిణీలో నిరంతర కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో నేటి వరకు రుణాల పంపిణీ పరంగా నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నది. జిల్లాలో కమ్మర్పల్లి మండలం మొదటి స్థానంలో కొనసాగుతున్నది. మిగతా మండలాల్లోనూ ఇలాంటి స్పూర్తితో పంపిణీ జరుగుతున్నది. దీంతో జిల్లాలో లక్ష్యం దిశగా రుణాల పంపిణీ సాగుతున్నది.
రుణాల పంపిణీలో ముందంజ
నిజామాబాద్ జిల్లాకు రూ.1227.62 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ లక్ష్యాన్ని ప్రభు త్వం నిర్దేశించింది. జిల్లాలో నేటికి 16,221 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.953 కోట్ల రుణాల పంపిణీ జరిగింది. రుణాల పంపిణీ పరంగా రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉన్నది. పంపిణీ జరిగిన శాతం పరంగా చూస్తే 77.68 శాతం పంపిణీ చేసి రాష్ట్రంలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నది. జిల్లాలో రికార్డు స్థాయిలో రుణాల పంపిణీ కొనసాగుతున్నది. భారీగా వచ్చిన రుణ అవకాశాలను జిల్లాలో మహిళా సంఘాల కోసం సద్వినియోగం చేసే లక్ష్యంతో ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ లక్ష్యాన్ని మూడు సార్లు పెంచారు. అదే స్ఫూర్తితో సాధిస్తున్న ఈ పంపిణీ పురోగతిని విశేషంగానే పేర్కొంటున్నారు.కమ్మర్పల్లి మండలానికి బ్యాంకు లింకేజీ రుణాల టార్గెట్ రూ.60 కోట్లుగా ఉంది. నేటి వరకు 777 మహిళా సంఘాలకు రూ.59.56 కోట్ల పంపిణీ జరిగింది. తద్వారా 99.19 శాతం లక్ష్యం పూర్తయ్యి జిల్లాలో మొదటి స్థానంలో కొనసాగుతున్నది. పొందిన రుణాలను మహిళా సంఘా లు తిరిగి వంద శాతం చెల్లిస్తున్నారు. రుణాల్లో మహిళల ఆదాయాభివృద్ధికి ప్రాధాన్యత ఉంటున్నది. దీంతో బ్యాంకు అధికారులు సైతం రుణాలను సకాలంలో అందిస్తూ వస్తున్నారు.
మంత్రి వేముల ప్రత్యేక దృష్టి
రుణాలను సద్వినియోగం చేసే లక్ష్యంతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి నిలిపారు. పలుమార్లు అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో పా ల్గొ న్న సమయంలోనూ మంత్రి ఈ లక్ష్యాలను సెర్ప్ సిబ్బందికి గుర్తు చేస్తూ.. రుణాలను ఆదాయాభివృద్ధికి వినియోగిస్తూ ఆర్థికాభివృద్ధి సాధించే నేర్పు, ఆర్థిక క్రమ శిక్షణ మహిళల్లో ఉంటుందని పునరుద్ఘాటిస్తూ వస్తున్నా రు. దీంతో పాటు కలెక్టర్ నారాయణరెడ్డి ప్రతి వారం నిర్వహిస్తున్న సమీక్షలు రుణాల పంపిణీని వేగవంతం చేశాయి. రుణ పరిమితి భారీగా పెరిగినందున అవకాశం ఉన్న మండలాలను గుర్తిస్తూ..అదనపు రుణాలను సైతం అందిస్తూ జిల్లా లక్ష్యం సాధించే దిశగా ప్రత్యేక ప్రణాళికతో అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా రుణాల పంపిణీ లక్ష్యాన్ని క్షేత్ర స్థాయిలో అన్ని మండలాల సెర్ప్-ఐకేపీ అధికారులు, సిబ్బంది ముందుకు తీసుకెళ్తున్నారు.
ప్రత్యేక ప్రణాళికతో ముందుకు..
పెద్ద ఎత్తున రుణాల పంపిణీ అనేది మహిళల సాధికారత లక్ష్యంలో కీలకమైన అంశం. అందుకు తగ్గట్టుగా కలెక్టర్ ప్రత్యేక ప్రణాళికతో పంపిణీకి దిశానిర్దేశం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా సెర్ప్ సిబ్బంది, మండల సమాఖ్యలు సమన్వయంతో కృషి చేస్తున్నాయి.
– చందర్ నాయక్, డీఆర్డీవో
రుణాలు సకాలంలో అందించడమే లక్ష్యం
సకాలంలో రుణాలు అందించడమే లక్ష్యంగా సిబ్బందితో కలిసి సమన్వయంతో పని చేస్తున్నాం. రుణ పంపిణీ లక్ష్యం పెరగడంతో మహిళా సంఘాల వ్యాపారాభివృద్ధికి, కొత్తగా వ్యాపారాల ఏర్పాటుకు, గ్రామీణ ప్రాంతం కావడంతో వ్యవసాయ అవసరాలకు రుణాలు పొందడానికి మహిళలకు మంచి అవకాశం ఇది. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం లక్ష్యం పూర్తి చేస్తాం.
-కుంట గంగాధర్ రెడ్డి, ఏపీఎం