మోర్తాడ్, జూలై 25: యువత పోరాట పటిమతో కేంద్ర ప్రభుత్వం దిగి రాకతప్పలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత రాజకీయాలకతీతకంగా తమ భవిష్యత్తు, విద్యావ్యవస్థలో పారదర్శక త కోసం చేపట్టిన ఉద్యమంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదని, ఇది దేశ యువత పోరాటంతో సాధించిన ప్రజాస్వామ్య విజయమని ఓ ప్రకటనలో అభివర్ణించారు. పరీక్షల భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితికి వ్యతిరేకంగా యువత శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా చేసిన పోరాటానికి కేంద్రం దిగిరాక తప్పలేదన్నారు.
లాఠీలకు ఎదురొడ్డి..
భవిష్యత్తు కోసం విద్యార్థులు, యువత ధైర్యంగా ఉద్యమం కొనసాగించారని ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల పోరాటాన్ని అణచి వేసేందుకు కేంద్రం లాఠీచార్జీలు, భాష్పవాయు గోళాలు వినియోగించడంతో పాటు అనేక నిర్భంధాలు విధించినప్పటికీ, యువత ఏ మాత్రం వెన క్కి తగ్గకుండా ధైర్యంగా ఉద్యమాన్ని కొనసాగించిందన్నారు. అధికారం ఎంత బలంగా కనిపించినా చైతన్యవంతమైన యువత సంకల్పం ముందు తలవంచక తప్పదనే విషయాన్ని ఈ ఉద్యమం మరోసారి నిరూపించిదన్నారు.
యువత ఐక్యపోరాటానికి ప్రభుత్వం దిగి వచ్చే పరిస్థితి ఏర్పడిందని, ధర్మేంద్రప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య పోరాటానికి లభించిన నైతిక విజయమని పేర్కొన్నారు. ఒకానొక సందర్భంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న ట్లు ‘దేశం కోసం అవసరం వచ్చినప్పుడు ఇండియా రియాక్ట్ అవుతుంది’ అనే మాటలను ఎమ్మెల్యే గుర్తు చేశారు. నేడు దేశ యువత అదే విషయాన్ని మరోసారి సాక్షాత్కరించిందన్నారు. యువత ప్రశ్నించడం ప్రారంభిస్తే అధికార వ్యవస్థలు జవాబుదారీ తనం వహించక తప్పదని, ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకే అంతిమ తీర్పు అని పేర్కొన్నారు.
సంస్కరణలు తేవాలి..
ఉద్యోగాల కోసం మాత్రమే కాదు.. దేశభవిష్యత్తు కోసం కూడా యువత పోరాడుతుందని ఈ ఉద్యమం స్పష్టం చేసిందని వేముల అన్నారు. జ్ఞానం, చైతన్యం, ఐక్యత కలిసొస్తే ఏ అహంకారమైనా కూలిపోవాల్సిందే అని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, విద్యావ్యవస్థ విశ్వసనీయత, పరీక్షల పారదర్శకత వంటి అంశాల్లో కేంద్రం ఇప్పటికైనా సమగ్ర సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యలు మొదలైన వెంటనే బాధ్యతాయుతంగా స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేకాదని, విద్యార్థుల ఆవేదనను నిర్లక్ష్యం చేయడంతోనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని విమర్శించారు.
ఇకపై దేశంలో ఏ విద్యార్థి కూడా పరీక్షల అవకతవకల కారణంగా నష్టపోకుండా కఠినమైన, పారదర్శకమైన పరీక్షల వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ఇది ఒక వ్యక్తి రాజీనామాతో ముగిసే అంశం కాదు, దేశ విద్యా వ్యవస్థ పై విద్యార్థుల్లో సంపూర్ణ విశ్వాసం నెలకొనే వరకు సంస్కరణలు కొనసాగాలి. అదే ఈ ఉద్యమం ఇచ్చిన అసలైన సందేశం అని వేముల స్పష్టం చేశారు. దేశ యువతకు ఈ విజయం ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందని, ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుతంగా పోరాడితే మార్పు సాధ్యమేననే నమ్మకాన్ని ఈ ఉద్యమం దేశప్రజల్లో మరింత బలపరిచిందని పేర్కొన్నారు.