Siddula Gutta | అలనాడు నవసిద్ధుల తపోవనమైన ఆ నల్లని బండరాళ్లు కాలక్రమేణా నవనాథసిద్ధుల గుట్టగా కీర్తికెక్కింది. ఈ నవనాథ సిద్ధులగుట్ట ప్రకృతి సోయగాల తోరణం.. సహజ అందాల పుణ్యక్షేత్రం. కపిలవర్ణంలో కళకళలాడే ఈ గుట్ట ఇప్పుడు పర్యాటక సొబగులు అద్దుకున్నది. ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి అకుంఠిత దీక్షతో అభివృద్ధి చేశారు. అనాదిగా ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధికెక్కడమే కాదు.. ప్రసుత్తం పర్యాటక కేంద్రంగా ఆహ్లాదం పంచుతున్న సిద్ధులగుట్టపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
– ఆర్మూర్, సెప్టెంబర్ 9
ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడి నవనాథసిద్ధుల గుట్టపై ఆధ్యాత్మికత వెల్లివిరుస్తున్నది. సువిశాలమైన స్థలంలో ప్రకృతి రమణీయతతో నిర్మించిన దేవాలయాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుటున్నాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ ఫలితంగా ఈ పురాతన ఆలయం పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్నది. రూ.20కోట్లతో గుట్టపైకి వెళ్లేందుకు ఘాట్ రోడ్డు నిర్మించారు. దీంతోపాటు రోడ్డు వెంట సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో రాత్రి వేళలో గుట్ట ప్రాంతం జిగేల్మంటూ కనువిందు చేస్తున్నది.
– ఆర్మూర్, సెప్టెంబర్ 9
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కృషి ఫలితంగా నవనాథ సిద్ధులగుట్ట ఆధ్యాత్మిక శోభతోపాటు పర్యాటక కేంద్రంగా మారింది. పర్యాటకుల తాకిడి సైతం గణనీయంగా పెరిగింది. గుట్టపై సినిమా షూటింగ్‌లు సైతం జరుగుతున్నాయి. హీరో నాగచైతన్య నటించిన లవ్‌స్టోరీ సినిమా షూటింగ్ సిద్ధులగుట్టపైనే జరిగింది. స్థానిక కళాకారులు సైతం తెలంగాణ జానపద గేయాలపై నృత్యాలను సిద్ధులగుట్టపైనే చిత్రీకరిస్తున్నారు.
నవనథ సిద్దులగుట్టపై రూ. కోటి వ్యయంతో నిర్మిస్తున్న ధ్యాన మందిర పిరమిడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సిద్దులగుట్టపై 700 గజాల స్థలాన్ని పిరమిడ్ నిర్మాణానికి కేటాయించారు. దాతల సహకారంతో పిరమిడ్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. మానసిక ప్రశాంతతకు పిరమిడ్ ధ్యానం ఎంతో ఉపకరిస్తుంది. ధ్యాన మందిర కమిటీ ఆధ్వర్యంలో పనులు నిర్వహిస్తుండగా, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
సిద్ధులగుట్టపై మరో అద్భుతం.. తరగని కోనేరు. సిద్ధులు తపస్సు చేసుకునే సమయంలో నీటికోసం కోనేరును తవ్వారు. ఈ కోనేరు ఎల్లప్పుడూ నీళ్లతో నిండుకుండలా ఉంటుంది. కోనేరులోని నీటిని భక్తులు పుణ్యతీర్థంగా సేవిస్తారు. ఈ నీటిని తాగితే రోగాలు రావని భక్తుల నమ్మకం. అందులో ఉండే స్తూపం ఉదయం ఒక రంగులో, మధ్యాహ్నం మరో రంగులో కనిపిస్తుంది. నవనాథ సిద్ధులు తపస్సు చేసినట్లుగా వారి అడుగు జాడలు ఇక్కడ దర్శమిస్తాయి. ఈ గుట్ట నుంచి గోదావరి నదికి సొరంగ మార్గం ఉన్నదని, సిద్ధులు గంగాస్నానం చేసేందుకు ఈ సొరంగ మార్గం గుండా వెళ్లేవారని పెద్దలు చెబుతారు.
ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన నవనాథ సిద్ధులగుట్ట.. పట్టణానికి మణిహారంగా నిలిచింది. నల్లని కొండరాళ్లతో సుమారు 2 నుంచి 3కిలోమీటర్ల మేర విస్తీర్ణంతో కొండ విస్తరించి ఉన్నది. సుమారు 300కు పైగా మెట్లు ఎక్కి సిద్ధులు ప్రతిష్ఠించిన సీతారాములను, కొండ గుహలోని శివలింగాన్ని దర్శించుకొని భక్తులు తరిస్తున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి రూ.20కోట్ల వ్యయంతో నిర్మించిన ఘాట్‌రోడ్డు నిర్మాణంతో సిద్ధులగుట్టకు మహర్దశ పట్టింది. సెంట్రల్ లైటింగ్‌తో ఘాట్ రోడ్డు దేదీప్యమానంగా వెలుగుతూ భక్తులను అలరిస్తున్నది. ఘాట్‌రోడ్డు నిర్మాణం పూర్తయ్యే వరకు జీవన్‌రెడ్డి ఉపవాస దీక్ష చేపట్టారు. రూ.20కోట్లతో గుట్టపై తొమ్మిది మందిరాలను నిర్మించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. అష్టలక్ష్మీదేవి, సహస్రార్జున, వినాయక, హనుమాన్, మార్కండేయ, పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి, వేంకటేశ్వర స్వామి, రాజరాజేశ్వర స్వామి, అయ్యప్ప మందిర నిర్మాణాలను చేపట్టారు. అందులో అయ్యప్ప మందిరం పూర్తయ్యింది. మెరుగైన సౌకర్యాల కోసం గుట్టపై చిల్డ్రెన్స్ పార్కు, మరుగుదొడ్లు, గోశాల ఏర్పాటు చేశారు. ప్లానిటోరియం నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ధ్యాన మందిర నిర్మాణానికి స్థలం కేటాయించగా, మరోచోట అతిపెద్ద పిరమిడ్ నిర్మిస్తున్నారు.
లోక కల్యాణార్థం నవనాథసిద్ధులు గోరఖ్‌నాథ్, జలంధర్‌నాథ్, చతపట్నాథ్, అడభంగనాథ్, కానిఫానాథ్, మచ్చేందర్నాథ్, చౌరంగీనాథ్, రేవన్నాథ్, భర్తీరీనాథ్ దేశమంతటా సంచరిస్తూ ఆర్మూర్‌కు చేరుకున్నారు. అప్పట్లో ఈ గ్రామం చుట్టూ కొండలు ఉండడంతో ఇక్కడి కొండగుహల్లో తపస్సు చేసేందుకు సరైన ప్రదేశంగా వారు ఎంచుకున్నారు. గుహలో శివలింగం, సీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించారు. ఏండ్లపాటు నవసిద్ధులు(మునులు)ఇక్కడే ఉండి తపస్సు చేశారని, ఆ తర్వాత కొంత కాలానికి ఆరుగురు సిద్ధులు వెళ్లిపోగా ముగ్గురు మాత్రం ఆర్మూర్‌లోనే ఉండిపోయారని ప్రాచీన గాథ ద్వారా తెలుస్తున్నది. అందుకే ‘ఆరు’ మూడు’ అని ఆరు, మూరు కాలక్రమంలో రూపాంతరం చెంది క్రమేపీ ఆర్మూర్‌గా వాడుకలోకి వచ్చినట్లు ప్రసిద్ధి. అదేవిధంగా నవసిద్ధులు తపస్సు చేసినందున నవనాథపురం అని ఈ పట్టణం ప్రాచుర్యంలోకి వచ్చింది.
నవనాథ సిద్ధుల గుట్ట ఘాట్‌రోడ్డు నిర్మాణం పూర్తయ్యే వరకు ఉపవాస దీక్ష చేపట్టాను. ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నడుం బిగించి సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నిధులు మంజూరు చేయించాను. రూ.20కోట్లతో నిర్మించిన ఘాట్‌రోడ్డుతో సిద్ధులగుట్టకు మహర్దశ వచ్చింది. సెంట్రల్ లైటింగ్‌తో ఘాట్ రోడ్డు దేదీప్యమానంగా వెలుగొందుతున్నది. రూ.20కోట్లతో గుట్టపై తొమ్మిది మందిరాలను నిర్మించేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. అయ్యప్ప ఆలయ నిర్మాణం పూర్తికాగా, మిగిలిన ఆలయాలను సైతం వేగవంతంగా పూర్తిచేస్తాం.
– ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఆర్మూర్