శక్కర్‌నగర్, అక్టోబర్ 10: తమకు కూడా ఇతర ఉద్యోగులకు అందిస్తున్న మాదిరిగా ట్రెజరీ ద్వారానే వేతనాలు అందించాలని డిమాండ్ చేస్తూ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు బోధన్ జిల్లా ప్రభుత్వ దవాఖాన ఎదుట శుక్రవారం మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ వేతనాల విషయంలో వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు పలుమార్లు చర్చలు జరిపి, ప్రభుత్వానికి నివేదించినా ఫలితంలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈనెల 9న సంబంధిత అధికారులతో చర్చించినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదన్నారు. తమ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలనే దిశగా జేఏసీ నాయకులు ఇచ్చిన పిలుపుమేరకు భోజన విరామ సమయంలో మౌన ప్రదర్శన చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ వేతనాలను ట్రెజరీ ద్వారా అందించాలని కోరారు. కార్యక్రమంలో వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు మల్లీశ్వరీ, జగదీశ్, అబ్దుల్ హమీద్, నర్సింహులు, శోభారాణితో పాటు పలువురు పాల్గొన్నారు.