నిజామాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ సాధన కోసం 2009 నవంబర్ 29న ప్రాణాలను పణంగా పెట్టి.. ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ పూనుకున్న అపూర్వఘట్టానికి 15 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ చారిత్రక సన్నివేశానికి గుర్తుగా బీఆర్ఎస్ పార్టీ ఆదేశాలతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాకేంద్రాల్లో గులాబీ సైన్యం శుక్రవారం దీక్షాదివస్‌ను ఘనంగా నిర్వహించింది. మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో విజయవంతంగా కార్యక్రమాలు జరిగాయి. నిజామాబాద్‌లో బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్తా, జడ్పీ మాజీ చైర్మన్ విఠల్‌రావు హాజరయ్యారు.
కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ అధ్యక్షుడు ముజీబుద్దీన్, మాజీ విప్ గంప గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, జడ్పీ మాజీ చైర్మన్లు దఫేదార్ రాజు, దఫేదార్ శోభ పాల్గొన్నారు. వీరితో పాటు వేలాది మంది గులాబీ సైనికులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. కేసీఆర్ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ పోరాట ఘట్టాలపై కామారెడ్డిలో డాక్యుమెంటరీ ప్రదర్శన జరిగింది. ఆ వీడియో చూస్తున్నంత సేపు సభికులందరూ ఉద్వేగానికి గురయ్యారు. నిజామాబాద్‌లో తెలంగాణ ఉద్యమకారుల అనుభవాల సమాహారం జరిగింది. ఇలా దీక్షా దివస్ ఆద్యంతం ఉద్వేగం, ఉత్సాహం మధ్య కొనసాగింది.
తెలంగాణ ఉద్యమ చరిత్రను చెరిపేసేందుకు అనేక కుట్రలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో పదేండ్ల క్రితం పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. అవే నిర్భంధాలు, అణచివేతలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ ఆనాటి ఉద్యమస్ఫూర్తిని దీక్షాదివస్ రగిలించింది. అవిశ్రాంతంగా పోరాటం చేసిన ఉద్యమకారులంతా దీక్షాదివస్తో మరో సంకల్ప దీక్షకు సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు.
చాలా రోజుల తర్వాత తెలంగాణ సాంస్కృతిక సందడి మార్మోగింది. జానపద పాటలతోపాటు పదేండ్ల కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంపై వచ్చిన పాటలు సైతం ఉర్రూతలూగించాయి. కాంగ్రెస్ వైఫల్యం కారణంగా దాపురించిన పరిస్థితులను కండ్లకు కట్టినట్లుగా కొనసాగాయి.