విద్యానగర్, డిసెంబర్ 26 : గుడ్ గవర్నెన్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగిన యూత్ పార్లమెంట్లో అనర్గళంగా ప్రసంగించిన బాన్సువాడ మండలంలోని పోచారం గ్రామానికి చెందిన కేతావత్ మౌనికకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం ఆమెను హైదరాబాద్‌లో తెలంగాణ, పంజాబ్ స్పీకర్లు పోచారం శ్రీనివాసరెడ్డి, సర్దార్ కుల్తార్ సింగ్ సాంద్వాన్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డితోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు అభినందించారు. జ్ఞాపికను అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లా గళాన్ని పార్లమెంట్లో వినిపించినందుకు గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. మౌనిక విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చుతో పాటు ఆమె సివిల్స్ శిక్షణకు అయ్యే ఖర్చును కూడా తానే భరిస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో కామారెడ్డి ఆర్కే కళాశాల కరస్పాండెంట్ జైపాల్ రెడ్డి, చైర్మన్ భాస్కర్ రావు, డీన్ నవీన్ కుమార్, ప్రిన్సిపాల్ గోవర్ధన్ రెడ్డి, కో-ఆర్డినేటర్ దత్తాత్రి పాల్గొన్నారు.
మౌనికను సన్మానించిన డీసీసీబీ చైర్మన్
కేతావత్ మౌనికను డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి అభినందించారు. ఆమెకు శాలువా కప్పి సన్మానించారు. తమ సొంత గ్రామానికి చెందిన మౌనిక తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికై పార్లమెంట్లో ప్రసంగించడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, నాయకులు ప్రవీణ్‌రెడ్డి, సాయిరెడ్డి, బల్రానాయక్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.