కామారెడ్డి,ఫిబ్రవరి 21: మంగళవాయిద్యాలు, మేళ తాళాలతో కళకళలాడుతున్న వివాహ వేడుకలో విషాదం నెలకొన్నది. పచ్చ ని పందిరిలో వివాహ తంతు కొనసాగుతుండగా పెండ్లి కూతు రి తండ్రి ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన కుటుంబీకు లు, బంధువులు వెంటనే దవాఖానకు తరలిస్తుండగా గుండెపోటుతో మృతిచెందాడు. ఈ హృదయవిదారకర ఘటన భిక్కనూర్ మండలంలో శుక్రవారం చోటుచేసుకున్నది.
భిక్కనూర్ మండలం రామేశ్వర్పల్లి గ్రామానికి చెందిన కుడిక్యాల బాల్చంద్రం (58)కు ఇద్దరు కూతుళ్లు కనకమహాలక్ష్మి, కళ్యాణమహాలక్ష్మి ఉన్నారు. పెద్ద కూతురు కనకమహాలక్ష్మి వివాహం శుక్రవారం బీటీఎస్ చౌరస్తా సమీపంలోని ఇంద్రప్రస్థ గార్డెన్లో నిర్వహించారు. మండపంలో నూతన వధువు, వరుడు జీలకర్ర, బెల్లం ఒకరి తలపై ఒకరు పెట్టుకున్న తర్వాత పెండ్లి జరుగుతుండగా ఒక్కసారిగా తండ్రి కుడిక్యాల బాల్చంద్రం గుండెపోటుకు గురై కుప్పకూలాడు.
కుటుంబ సభ్యులు గమనించి వెంటనే దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ విషయం తెలియడంతో ఒక్కసారిగా ఫంక్షన్ హాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కల్యాణ వేదికపై ఉన్నవారు కన్నీటి పర్యంతమయ్యారు. అంత్యక్రియలు కామారెడ్డిలో నిర్వహించగా..పెండ్లికి వచ్చిన వారందరూ పాల్గొన్నారు. గతంలో కనకమహాలక్ష్మి, కళ్యాణమహాలక్ష్మి అంతర్జాతీయ స్థాయిలో జ్ఞాపకశక్తి పోటీల్లో పాల్గొని అందరి మన్ననలు పొందారు.