నిజామాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైస్ మిల్లుల్లో అక్రమాల బాగోతం రోజుకొకటి బయట పడుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో రైస్ మిల్లర్లపై పౌరసరఫరాల సంస్థ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. అప్పనంగా రూ.వందల కోట్లు విలువ చేసే ధాన్యాన్ని మాయం చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తనిఖీల్లో కనిపించని ధాన్యం బస్తాల లెక్కలతో ఆధారాలతో సహా పోలీసులకు రాతపూర్వకంగా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ ఫిర్యాదు చేయడంతో ఆయా పోలీస్ స్టేషన్లలో అక్రమార్కులపై ఎఫ్ఐఆర్ అవుతోంది.
గడిచిన నెల రోజుల్లో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఆరు రైస్ మిల్లులపై కేసులు నమోదు అయ్యాయి. ఇందులో మొత్తంగా రూ.200కోట్లకు పైగా ధాన్యం నిలువలు మాయం అయినట్లుగా అధికారులు అధికారికంగా గుర్తించారు. రెండు రోజుల క్రితం డిచ్పల్లి మండలంలోనూ రైస్‌మిల్లు యజమానులపై క్రిమినల్ కేసు నమోదైంది. ఇందులో 8,614 మెట్రిక్ టన్నుల ధాన్యం కనిపించడం లేదు. వీటి విలువ రూ.27కోట్లుగా పౌరసరఫరాల సంస్థ తేల్చింది. లెక్కలు తప్పడం, ప్రభుత్వం నుంచి స్వీకరించిన ధాన్యాన్ని మాయం చేయడం, సరైన సమయంలో తిరిగి చెల్లింపులు లేకపోవడంపై కొరడా ఝుళిపిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూస్తున్న సీఎంఆర్ దందాలో కాంగ్రెస్, బీజేపీతో సంబంధం కలిగిన వారే ఎక్కువ మంది ఉంటున్నారు. ప్రస్తుతం అధికార పార్టీతో అన్యోన్యంగా మెదులుతున్న వ్యక్తుల రైస్ మిల్లుల్లోనే రూ.వందల కోట్లు విలువ చేసే సీఎంఆర్ అక్రమాలు జరగడం విడ్డూరంగా మారుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 32 నెలల్లో మొత్తం నాలుగు పంట కాలాలు సంపూర్ణమైంది. ఈ నాలుగు సీజన్లకు చెంది న ధాన్యాన్ని మర ఆడించేందుకు రైస్ మిల్లర్లకు కట్టబెట్టింది. కఠిన నిబంధనలు అమలు చేసి మిల్లర్ల నుంచి ష్యూరిటీ తీసుకోవాల్సిన పౌరసరఫరాల సంస్థ ఆ స్థాయిలో ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు.
తూతూ మంత్రంగానే ఒప్పందాలు చేసుకుంది. ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి అధికార పార్టీ నేతల ప్రోద్బలం, ఒత్తిడికి తలొగ్గి ఇష్టారీతిన కేటాయింపులు చేశారు. గడువు తీరినప్పటికీ సీఎంఆర్ రాకపోవడంతో ప్రభుత్వం వద్ద లోటు ఏర్పడింది. రూ.వేల కోట్లు విలువ చేసే ధాన్యం నిల్వలు మాయం అయినట్లుగా విజిలెన్స్ తనిఖీలు తేలడంతో అక్రమార్కులపై ఇంత కాలానికి చర్యలకు కాంగ్రెస్ సర్కారు దిగింది. ఇందులో అధికార పార్టీకి చెందిన వారే ఎక్కువ మంది ఉండటంతో వారిపై తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో రైస్ మిల్లర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో సీఎంఆర్ మెక్కిన అక్రమార్కులు చాలా మంది ఉన్నారు. రైస్ మిల్లర్లలో కీలక నేతలను ప్రసన్నం చేసుకుని సామర్థ్యానికి మించి కేటాయింపులు దక్కించుకున్నారు. వాటిని మర ఆడించకుండానే ధాన్యాన్ని పక్కదారి పట్టించి వచ్చిన డబ్బుతో వడ్డీలు కట్టుకోవడం, బాకీలు ముట్టజెప్పుకోవడం లాంటివి చేసుకున్నారు. తద్వారా ఆర్థిక ప్రయోజనాన్ని ఉద్ధేశపూర్వకంగా చేశారు. ప్రభుత్వ సొత్తుతో భారీ ఎత్తున అక్రమంగా సంపాదించారు. తమది కానటువంటి ధాన్యాన్ని అడ్డం పెట్టి అక్రమార్కులు భారీగా మోసాలకు పాల్పడ్డారు. విజిలెన్స్ తనిఖీలతో కేసులు నమోదు అవుతుండగా అవినీతిపరులంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పెనాల్టీతో సహా ధాన్యానికి సంబంధించిన డబ్బులు చెల్లించేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కొంత మంది ధాన్యాన్ని సర్దుబాటు చేసుకుంటూ సేఫ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.