కోటగిరి, జూన్ 10 : తనకున్న కొంత వ్యవసాయ భూమిని సమర్థవంతంగా వినియోగించుకొని.. కూరగాయలు సాగు చేస్తూ రాబడిని సాధిస్తున్నారు కోటగిరి మండలం ఎత్తొండ గ్రామానికి చెందిన మేత్రి సాయిలు దంపతులు. కేవలం 30 గుంటల భూమిలో బెండకాయ, చిక్కుడు, టమాట, వంగ సాగు చేస్తూ లాభాలు పొందుతున్నారు. ఎత్తొండ గ్రామం.. కోటగిరి, రుద్రూర్, బోధన్ మండలాల కేంద్రాలకు సమీపంలో ఉండడంతో డిమాండ్ ఉన్న కూరగాయలను సాగు చేస్తున్నారు. అంతకుముందు వరి సాగు చేసినా అంతగా ఆదాయం రాకపోవడంతో ఏడాది క్రితం నుంచి కూరగాయలు సాగు చేస్తున్నారు. లాభాలు బాగా రావడంతో కూరగాయల సాగుపై మరింత దృష్టిపెట్టారు. దశల వారీగా చేతికి అందే విధంగా కూరగాయలను సాగుచేస్తున్నారు.
భార్యాభర్తలే కూరగాయలను తెంపి తెల్లవారుజామున బోధన్, పొతంగల్, వర్ని, కోటగిరి మార్కెట్లకు వెళ్లి విక్రయిస్తున్నారు. కొన్నిసార్లు పొలం వద్దనే విక్రయిస్తుంటారు. ఆరు నెలల పాటు పంట చేతికోచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రతి రోజూ రూ.1000 నుంచి రూ.1500 ఆదాయం వస్తున్నదని మేత్రి సాయిలు తెలిపారు.
కూరగాయలతో మంచి ఆదాయం
వరి పంట కన్నా కూరగాయలు సాగు చేయడమే మేలు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చు. గతంలో ఇక్కడ పనిలేకపోవడంతో దుబాయ్‌కి వెళ్లి పనిచేశాను. అక్కడ నెలకు రూ.30 వేలు వచ్చేవి. డబ్బులు మిగలకపోవడంతో ఊళ్లోనే కూరగాయలు సాగుచేసి ఎక్కువ సంపాదించాలని అనుకున్నా. ఏడాది కింద దుబాయ్ నుంచి ఎత్తొండకు వచ్చి 40 గుంటల్లో కూరగాయలను సాగు చేశా. ఒక సీజన్లోనే మూడు రకాల కూరగాయలపై రూ.60 వేలు పెట్టుబడి పెడితే రూ.1.70 లక్ష ఆదాయం వచ్చింది. ప్రభుత్వం కూరగాయలకు డ్రిప్ సౌకర్యం కల్పిస్తే మరింత కూరగాయలు సాగు చేసుకుంటాం.
-మేత్రి సాయిలు, రైతు, ఎత్తొండ