రెంజల్, జూన్10 : మండలంలోని కందకుర్తి గ్రామ సమీపంలో గల గోదావరి నదిలో కొత్తనీరు పారుతున్నది. పొరుగున గల మహారాష్ట్రలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దిగువన ఉన్న నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి, హరిద్ర, మంజీరా నదుల కలయికతో ఏర్పడే త్రివేణి సంగమంలోకి కొత్త నీరు ప్రవేశిస్తుంది. ఎండాకాలంలో నీరు లేక ఎడారి తలపించిన గోదారమ్మ మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకొత్త నీరు వచ్చి చేరుతున్నది.
త్రివేణి సంగమంలో పర్వదినాల సందర్భంగా సందర్శకులు కొత్త నీటి ప్రవాహాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎండాకాలంలో భక్తులకు సరైన నీరు లేక గుంతల్లో నిలిచిన నీళ్లతోనే పుణ్య స్నానాలు ఆచరించి సరిపెట్టుకున్నారు. కొత్తగా పారుతున్న నీటీలో గడ్డితో తయారు చేసిన తిప్పలో భక్తులు పిండివంటలు తయారు చేసిన నైవేద్యాలను సమర్పించి చల్లంగా చూడు గోదారమ్మ అంటూ గోదారమ్మకు మొక్కులు తీర్చుకుంటున్నారు. నదిలో పుణ్య స్థానం ఆచరించారు. పురాతన శివాలయాన్ని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిచారు.