ఖలీల్‌వాడి, ఏప్రిల్ 10 : నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ, బోధన్ డివిజన్లలో రెండు రోజుల క్రితం కురిసిన వడగండ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. మొత్తం 1726.12 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. 910 మంది రైతులు నష్టపోగా, అత్యధికంగా వరి పంట దెబ్బతిన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్ తెలిపారు. వర్ని మండలంలో 61 ఎకరాలు, మోస్రాలో 94, చందూర్‌లో 240, రుద్రుర్‌లో 5, కోటగిరిలో 34, పొతంగల్‌లో 176, బోధన్‌లో 68, సాలూరా మండలంలో183 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు వెల్లడించారు. దీంతోపాటు మామిడి, బొప్పాయి, మునగ, సొరకాయ, జొన్న పంటలకు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు.