బోధన్, జూలై 21: రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన లక్షలోపు రుణమాఫీ ప్రక్రియ గందరగోళంగా మారింది. గ్రామాల్లో ఇప్పటికీ రుణమాఫీపై రైతుల్లో అయోమయం నెలకొన్నది. ఎవరెవరికి రుణమాఫీ అయ్యింది.. ప్రభుత్వ నిబంధనల ప్రకారంలో అన్ని అర్హతలు ఉన్నా రుణమాఫీ ఎందుకు జరగలేదు..కొందరికి రుణమాఫీ జాబితాలో పేరు ఉన్నా ఖాతాలో డబ్బులు జమకాకపోవడం తదితర అంశాలపై సందిగ్ధత నెలకొన్నది. బ్యాంకుల్లో రూ.లక్ష వరకు రుణమాఫీ అర్హులందరికీ అమలుకాకపోగా.. రైతు నేస్తాలుగా పేరొందిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుణమాఫీ ప్రక్రియ గందరగోళంగా మారింది.
సహకార సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల్లో రూ.లక్ష వరకు రుణం పొందినవారిలో మూడో వంతు మందికి కూడా రుణమాఫీ జరగలేదని తేలిపోయింది. జిల్లాలోని ప్రతి సహకార సంఘంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. దీంతో రూ.లక్ష వరకు రుణమాఫీ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 18న ఎంతో అర్భాటంగా చేసిన ప్రకటనకు, సహకార సంఘాలకు అందిన రుణమాఫీ జాబితాలకు పొంతనలేకుండా పోయింది. సొసైటీల్లో మూడో వంతు మందికి కూడా రుణమాఫీ లబ్ధి అందలేదు. కొన్ని సొసైటీల్లోనైతే ఐదో వంతు మందికి కూడా రుణమాఫీ జరగలేదు. ఎన్నికలకు ముందు రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ భారం నుంచి తప్పించుకునేందుకు అనేక షరతులు విధించింది.
రేషన్ కార్డు కావాలని, కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ చేస్తామంటూ కొర్రీలు, కోతలు పెట్టడంతో ఆచరణలో అర్హులైన రైతులకు రుణమాఫీ అందలేదు. దీంతో రైతులు ఆందోళనకు గురువుతున్నారు. ఒకవైపు జోరుగా వర్షాలు కురుస్తుండడంతో, ఇప్పుడిప్పుడే వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులకు ఈ రుణమాఫీ వ్యవహారం ఆందోళనను కలిగిస్తున్నది.. పనులు మానేసి బ్యాంకులు, సహకార సంఘాలకు పరుగులు తీస్తున్నారు.
అక్కడ వారికి ఎటువంటి సమాధానం దొరకడంలేదు. తమకేమీ తెలియదని, పైనుంచే రుణమాఫీ జాబితాలను పంపారంటూ సహకార సంఘాల సిబ్బంది సమాధానమిస్తున్నారు. ఆయా సొసైటీల పాలకవర్గాలు సైతం రుణమాఫీ వ్యవహారంపై విస్తుపోతున్నారు. రుణమాఫీ అమల్లోకి వచ్చి నాలుగు రోజులవుతున్నప్పటికీ స్పష్టత లేకపోవడంతో.. గ్రామాల్లోని చోటా, మోటా కాంగ్రెస్ నాయకులు ముఖం చాటేయడం ప్రారంభించారు. గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండుసార్లు చేసిన రుణమాఫీతో అర్హులందరికీ లబ్ధి చేకూరిన విషయమై ఇప్పుడు పల్లెల్లో చర్చించుకుంటున్నారు.
రుణమాఫీకి రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోబోమని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు చెబుతున్నప్పటికీ, ఇప్పటికే ఆధార్‌తో లింకైన రేషన్ కార్డులను తీసుకోవడంతో అనేక మంది రైతులు రుణమాఫీకి అనర్హులైనట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కుటుంబాలు పెద్దవై విడిపోయినప్పటికీ, ఇప్పటికీ ఒకే రేషన్ కార్డు మీద అందరి పేర్లు ఉన్నాయి. చాలామంది రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోలేదు. గతంలో కేసీఆర్ రుణమాఫీకి కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీకి కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకోవడంతోనే రైతులు పెద్ద సంఖ్యలో రుణమాఫీకి నోచుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మేము సాలూర సొసైటీలో రూ.80 వేలు రుణం తీసుకున్నాం.. ఇప్పటివరకు రైతు భరోసా రాలేదు. కనీసం రుణమాఫీ జరుగుతుందని ఆశించాం. కానీ అర్హుల జాబితాలో నా పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఒక వేళ బ్యాంక్‌లో మా పేరిట రుణం తీసుకున్నామా అంటే.. రెండేండ్ల కిందటే బ్యాంక్ రుణం తీర్చేశాం.. సొసైటీలోనే రూ.80 వేలు తీసుకున్నాం.. ఇప్పుడా రుణం కూడా ఎందుకు మాఫీ కాలేదు.. ఇలాగైతే ఎలా.. మాఫీ జరిగివుంటే.. మళ్లీ రుణం తీసుకునేవాళ్లం.. పెట్టుబడులకు పనికివచ్చేది.. రుణమాఫీ జరగకపోవడానికి అధికారులు కారణం చెప్పాలి..
-ముట్టెన్ గంగారాం, రైతు, సాలూర
ఎడపల్లి సొసైటీలో ఐదో వంతు మం దికే రుణమాఫీ జరిగింది. ఈ సంఘం లో రూ.లక్ష రుణాలు పొందినవారు 202 మంది రైతులు ఉండగా, ప్రస్తుతం వారిలో 43 మందికే రుణమాఫీ జరిగింది. రాష్ట్రంలోని ఆదర్శ సహకార సంఘాల్లో ఒకటైన పొతంగల్ విశాల సహకార సంఘంలో అర్హులైన రైతులు 407 మంది ఉండగా, వారిలో కేవలం 98 మంది రైతులకే రుణమాఫీ కావడం గమనార్హం.
నాకు 1.13 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కోటగిరి ఎస్బీఐలో పంట రుణం కోసం మూడేండ్ల క్రితం రూ.65 వేలు రుణం తీసుకున్న. రుణమాఫీ జాబితాలో రూ. 92,493 మాఫీ అయినట్లు బ్యాంకు బయట గోడకు పెట్టిన జాబితాలో నా పేరు ఉంది. కానీ బ్యాంకులో అధికారులకు అడిగితే వచ్చినయ్ కానీ మళ్లీ వాపస్ పోయినాయని సమాధానం చెబుతున్నారు. నాకేం అర్థం కావడం లేదు.. దీనిపై ఎవరిని అడిగినా వివరాలు చెప్పట్లేదు. రూ.లక్షలోపు రుణం ఉన్న ప్రతి ఒక్కరికీ మాఫి చేస్తామని ప్రభుత్వం చెప్పింది. నా రుణం మాఫీ అవుతుందా.? లేదా? అనేది అర్థం కావడం లేదు.
-బట్టు సాయిలు, రైతు, కోటగిరి