వినాయక్‌నగర్, జనవరి 24: జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లు తాము ప్రయాణిస్తున్న కారుతో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టగా, ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో, ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారకులైన ఎక్సైజ్ సీఐ స్వప్నతో పాటు కానిస్టేబుల్ అమీద్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం సుభాషన్నగర్లో ఉన్న ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కానిస్టేబుల్ సౌమ్య ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నదని, ఆమె ఈ స్థితికి రావడానికి సీఐ స్వప్న, కానిస్టేబుల్ అమీద్ కారణమని ఆరోపించారు. సౌమ్య శరీరంలోని అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఓ కిడ్నీ తొలగించామని వైద్యులు చెప్పారని తెలిపారు. సీఐ స్వప్న డిపార్టుమెంట్లో తమకు మంచి పేరు రావాలని కానిస్టేబుల్ అమీద్‌తో కలిసి గంజాయి స్మగ్లర్లతో చేతులు కలిపి నిర్మల్ జిల్లా నుంచి నిజామాబాద్‌కు గంజాయి తెప్పించి, వారిని పట్టుకున్నట్లు ప్లాన్ వేశారని ఆరోపించారు. నిజంగా గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు వెళ్లాల్సి ఉంటే ముందు జాగ్రత్తగా పోలీసులకు సమాచారం ఇచ్చి, వారి సహకారంతో కలిసి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. అలా కాకుండా కేవలం ఉన్నతాధికారుల మెప్పు పొందడానికి సీఐ చేపట్టిన ప్లాన్ తమ తోటి సిబ్బంది ప్రాణాల మీదికి వచ్చిందని మండిపడ్డారు. సీఐ స్వప్న, కానిస్టేబుల్ అమీద్‌ను జిల్లా నుంచి పంపించాలని డిమాండ్ చేశారు.
బాధితురాలికి అండగా ఉంటాం: డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి
ప్రాణాపాయ స్థితిలో ఉన్న సౌమ్యకు మెరుగైన వైద్యం అందించడానికి అందరం కృషి చేద్దామని, ఆమె ఆరోగ్యం మెరుగు పడిన అనంతరం శాఖాపరంగా వచ్చే ఆర్థిక సహాయం కోసం తాము కృషి చేస్తామని డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి అన్నారు. సిబ్బంది డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అమలుకు కృషిచేస్తానని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.
సౌమ్యకు కలెక్టర్ పరామర్శ
దవాఖానలో చికిత్స పొందుతున్న సౌమ్యను కలెక్టర్ ఇలా త్రిపాఠి పరామర్శించారు. ఆమె కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ పై హత్యాయత్నం ఘటనపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు ఎక్సైజ్ కమిషనర్ ఆరా తీశారు. డిప్యూటీ కమిషనర్‌కు ఫోన్ చేసి,వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నలుగురిపై కేసు నమోదు
మాధవ్‌నగర్ వద్ద శుక్రవారం జరిగిన ఘటనలో ఎక్సైజ్ సీఐ స్వప్న ఫిర్యాదు మేరకు నలుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ శనివారం తెలిపారు. కానిస్టేబుల్ సౌమ్యను కారుతో ఢీకొట్టిన సోహెల్, రాహిల్, మతిన్‌తోపాటు మరొకరిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.