నిజామాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) కాంగ్రెస్‌లో అసమ్మతి రాగాలుఊపందుకుంటున్నాయి. పదవుల పందేరంలో బాల్కొండ నియోజకవర్గానికే ప్రాధాన్యమివ్వడంపై అధికార పార్టీలో నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. ఒకే ఒరలో నాలుగు కత్తులను దూర్చిన అధిష్టానంపై అసంతృప్త జ్వాలలు చెలరేగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 37 కార్పొరేషన్ల చైర్మన్లను నియమించగా, అందులో ఉమ్మడి జిల్లాకు నాలుగు పదవులు వరించాయి.
ఈ నాలుగింట్లో ఒక్కటి మాత్రమే బాన్సువాడకు, మిగతా మూడు ఒక్క బాల్కొండ నియోజకవర్గానికే చెందిన నాయకులకే దక్కాయి. డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మానాల మోహన్‌రెడ్డికి సహకార యూనియన్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్రెడ్డికి సీడ్ కార్పొరేషన్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌కు మైనింగ్ కార్పొరేషన్ పదవులు కట్టబెట్టారు. కాసుల బాలరాజును ఆగ్రోస్ చైర్మన్‌గా నియమించారు. సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకోకపోవడం, అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచినా సీనియర్లకు ఇంత వరకూ పదవులను కట్టబెట్టకపోవడంతో అధికార పార్టీలో అసంతృప్తి రాగాలు పెరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం మార్కెట్ కమిటీలను భర్తీ చేసి ‘చేతులు’ దులుపుకోగా, కీలక నేతలంతా తమ వంతు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ వారికి నిరాశే మిగిలింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బాల్కొండ నియోజకవర్గానికి పెద్దపీట వేశారు. ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురికి పదవులు లభించాయి. అయితే వీరంతా కలిసి మెలిసి పని చేస్తారా.. లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వీరికి అదనంగా డీసీసీబీ చైర్మన్ రమేశ్‌రెడ్డి తోడవ్వడం చర్చనీయాంశమైంది. వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన వ్యక్తికి చైర్మన్ పదవి కట్టబెట్టడం ద్వారా కాంగ్రెస్ ఆసక్తికర రాజకీయాలకు తెర లేపింది. మరోవైపు, నియోజవకర్గ ఇన్చార్జిగా సునీల్‌రెడ్డి కూడా పార్టీలో పట్టు పెంచుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు పెరిగిపోయాయి. ఎవరికి వారే పట్టు కోసం పాకులాడుతుండడంతో శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. మరోవైపు, ఒక్క బాల్కొండ నియోజకవర్గానికే ఏకంగా నాలుగు కీలక పదవులు దక్కడంపై మిగతా ప్రాంతాల నేతలు అసంతృప్తితో ఉన్నారు. సంవత్సరాల నుంచి కష్టపడి పని చేసిన తమను కాదని, ఒకే నియోజకవర్గానికి పెద్దపీట వేయడంపై లోలోన రగిలి పోతున్నారు.
కాంగ్రెస్ అంటేనే అంతర్గత కుమ్ములాటలకు పెట్టింది పేరు. బాల్కొండ నియోజకవర్గమే అందుకు నిదర్శనం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, అన్వేశ్‌రెడ్డి చివరి వరకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది.
ఎన్నికలకు కొద్ది నెలల ముందు పార్టీలో చేరిన అతడికి టికెట్ ఇవ్వడంపై పాత తరం నేతలంతా నొచ్చుకున్నారు. కొత్తగా వచ్చిన వ్యక్తికి అసెంబ్లీ టికెట్ ఇవ్వడమే కాకుండా నియోజకవర్గ ఇన్‌చార్జీగా కొనసాగిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏండ్ల నుంచి పార్టీలో ఉంటున్న తమపై కొత్తగా వచ్చిన వారి పెత్తనం ఏమిటన్న ఆవేదనతో రగిలి పోతున్నారు. ఇదే అవకాశంగా మలుచుకంటున్న నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు తమ బలాన్ని పెంచుకునే పనిలో పడ్డారు.
బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డికి ఎనలేని ప్రాధాన్యం దక్కింది. ఆర్అండ్బీ, శాసనసభా వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖలకు మంత్రిగా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఉమ్మడి జిల్లాపై చెరగని ముద్ర వేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు రాగా, బాల్కొండలో మాత్రం గులాబీ జెండా రెపరెపలాడింది. ఈ పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్‌కు వేముల కొరకరాని కొయ్యగా మారడంతో అధికార పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు.
వేములను ఎదుర్కొనే ధైర్యం లేక బాల్కొండకు కేబినెట్ ర్యాంకుతో కూడిన ముగ్గురికి చైర్మన్ పోస్టులు ఇవ్వడం ఇందులో భాగమేనన్న చర్చ నడుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను, లోపాలను ఎత్తి చూపడం ద్వారా ప్రశాంత్‌రెడ్డి అధికార పార్టీని ముప్పుతిప్పులు పెడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో, ఉమ్మడి జిల్లాలోనూ కీలకమైన నేతగా ఉన్న వేములను ఢీ కొట్టేందుకే కాంగ్రెస్ స్కెచ్ వేసినట్లుగా చర్చ నడుస్తున్నది. అయితే, మాజీ మంత్రిని టార్గెట్ చేసే క్రమంలో కాంగ్రెస్ అనుసరించిన వైఖరి ఆ పార్టీలోనే అసంతృప్తికి దారి తీసింది. బాల్కొండకే పదవులను కట్టబెట్టి మిగిలిన నియోజకవర్గాల్లోని సీనియర్ నేతలకు మొండి‘చేయి’ చూపడంతో వారంతా అసంతృప్తితో రగిలి పోతున్నారు. పీసీసీ నాయకత్వాన్ని తూర్పార పడుతున్నారు.