జక్రాన్‌పల్లి, అక్టోబర్ 20 : పాఠశాలలో తన సొంత డబ్బులతో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాలని ఎమ్మెల్యేను అడగడానికి వెళ్లిన మాజీ సర్పంచ్‌పై కాంగ్రెస్ నాయకులు దౌర్జాన్యానికి పాల్పడ్డారు. ఈ విషయమై తోపులాట చోటుచేసుకోగా.. సదరు మాజీ సర్పంచ్‌ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్‌లో ఆదివారం చోటుచేసుకున్నది. సికింద్రాపూర్‌లో అర్గుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వచ్చారు.
అదే గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో అభివృద్ధి పనులకు రూ.7లక్షల నిధులు మంజూరయ్యాయి. ఆ నిధులు త్వరగా రాకపోవడంతో పనులు నిలిచిపోవద్దనే ఉద్దేశంతో గ్రామ మాజీ ఉపసర్పంచ్ అప్పాల అరుణ్‌కుమార్ ముందుకొచ్చి తన సొంత డబ్బులు రూ.60వేలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పీఏ శ్రీనివాసరెడ్డి ..అరుణ్‌కు ఫోన్ చేసి ‘నీవు ఎందుకు పనులు చేయిస్తున్నావు.. మా పార్టీ వారు చేయిస్తారు.. నీవు పనులు ఆపేయ్’ అని చెప్పారు. దీంతో అరుణ్ పనులు నిలిపివేశారు.
ఆదివారం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే భూపతిరెడ్డిని పాఠశాలలో అభివృద్ధి పనులకు రూ.60 ఖర్చు పెట్టానని, బిల్లులు ఇప్పించాలని వెళ్లగా స్థానిక కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీపీ, ఆయన సోదరుడు కలిసి అరుణ్‌ను అడ్డుకొని తోసేశారు. దీంతో ఎమ్మెల్యే ఎదుట తోపులాట జరిగింది. వెంటనే అక్కడున్న పోలీసులు అరుణ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పని చేసిన కష్టానికి డబ్బులు అడిగితే కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం ఎంతవరకు సమంజసమో ఎమ్మెల్యే చెప్పాలని అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, పాఠశాల అభివృద్ధికి తాను వెచ్చించిన డబ్బులు ఇవ్వాలని కోరారు.