ముప్కాల్, జూలై 10 : ముప్కాల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కస్తూర్బా విద్యాలయం అద్దె భవనంలో కొనసాగుతున్నది. కొత్త భవనం ఏర్పాటు చేసినా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో అద్దె భవనంలో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మండల కేంద్రానికి కస్తూర్బా విద్యాలయాన్ని మంజూరు చేశారు. భవన నిర్మాణం కోసం రూ.3.5 కోట్ల నిధులు కేటాయించగా.. 2021 జనవరి 4న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.
నాటి నుంచి ఇప్పటివరకు నిర్మాణ పనులు కొనసాగుతూ వచ్చాయి. కస్తూర్బా పాఠశాల ఈ విద్యా సంవత్సరం నూతన భవనంలోకి మారుతుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావంచారు. కానీ బిల్లులు అందలేదని పనులు చేపట్టిన కాంట్రాక్టర్ భవనానికి తాళాలు వేశారు. దీంతో అద్దె భవనంలోనే పాఠశాలను కొనసాగిస్తుండడం గమనార్హం.
అదనపు గదులు లేకపోవడంతో తరగతి గదుల్లోనే విద్యార్థినులు ట్రంకు పెట్టెలను సర్దుకున్నారు. చదువుకునే సమయంలో పైన ఉంచడం, సాయంత్రం కిందికి దించుకొని చదువుకోవడం నిత్యకృత్యంగా మారింది. వర్షాకాలం కావడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయట స్థలం లేకపోవడంతో తరగతి గదుల్లోనే తాళ్లు కట్టుకొని దుస్తులను ఆరేసుకుంటున్నారు.
గదుల కొరతతో కంప్యూటర్ క్లాస్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ క్లాస్‌లు బోధించడం కష్టంగా మారింది. ఒక తరగతి వారికి చెట్ల కింద బోధిస్తున్నాం. విద్యార్థినులు నాలుగు గదుల్లో సర్దుకుపోతున్నారు. అన్ని సౌకర్యాలతో నూతన భవనం సిద్ధంగా ఉండడంతో విద్యార్థినుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. కళాశాల తరగతులు కూడా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. పాఠశాలను నూతన భవనంలోకి మార్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
– ఆర్ వినోద, ఎస్వోతన భవనానికి తాళం వేశారు.