బోధన్, జూన్ 25: ‘నిజాం షుగర్స్‌ను పునరుద్ధరిస్తాం.. ముందుగా బోధన్‌లోని నిజాం చక్కెర క ర్మాగారాన్ని తెరుస్తాం.. ’ అంటూ పదే పదే కాం గ్రెస్ నాయకులు, ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు కార్యరూపం దాల్చడంలేదు. అసలు ఫ్యాక్టరీని తెరుస్తారా.. ఒకవేళ ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేయాలనుకుంటే ఎటువంటి కార్యాచరణ అమలుచేయనున్నారనే విషయమై ఇప్పటికీ స్పష్టత లేదు. సీమాంధ్ర పాలకుల పుణ్యమా అని ఒకప్పుడు ఆసియా ఖండంలోనే అతి పెద్ద చక్కెర ఫ్యాక్టరీగా గుర్తింపు పొందిన నిజాంషుగర్ ఫ్యాక్టరీ తన ప్రాభవాన్ని క్రమంగా కోల్పోయింది. చంద్రబాబు పాలనలో నిజాంషుగర్స్ సంస్థ జాయింట్ వెంచర్ పేరిట ప్రైవేట్ కంపెనీ పరమైంది.
దీంతో కంపెనీ యాజమాన్యం ఫ్యాక్టరీని అడ్దంపెట్టుకుని కోట్లాది రూపాయల సంపదను దోచుకుని, చివరికి ఈ ఫ్యాక్టరీని నడపలేమంటూ చేతులెత్తేసింది. నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్‌కు చెందిన బోధన్‌లోని శక్కర్‌నగర్, మెట్పల్లి, మెదక్ యూనిట్లకు 2015 డిసెంబర్లో లేఆఫ్ ప్రకటించింది. దీంతో ఫ్యాక్టరీ కార్మికులు రోడ్డున పడ్డారు. చెరుకు కొనే దిక్కులేకపోవడంతో రైతులు చెరుకు సాగును మానేశారు. అయితే ఫ్యాక్టరీని మళ్లీ పునరుద్ధరించాలనే డిమాండ్‌ను కార్మికులు, కర్షకులు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాం గ్రెస్ పార్టీ నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చింది.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తరపున నిజాం షుగర్స్‌ను పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు బోధన్ ఎమ్మె ల్యే సుదర్శన్‌రెడ్డి పదే పదే ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఈ మేరకు ఫ్యాక్టరీ యూనిట్ల పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు గతేడాది జనవరిలోమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ లో ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డితోపాటు నిజాం షుగర్స్ యూనిట్లు ఉన్న జిల్లాల్లోని కొందరు ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ మొక్కుబడిగా ఒకసారి శక్కర్‌నగర్, మెట్పల్లి, మెదక్ యూనిట్లను సందర్శించింది.
అయితే, లోతుగా ఎటువంటి అధ్యయనం జరగలేదు. కొంతమంది రైతులతో మాట్లాడడం తప్ప.. ఫ్యాక్టరీ ప్రారంభానికి కావాల్సిన ముడిసరుకు చెరుకు పంటను ప్రోత్సహించేందుకు ఏం చేయాలన్నదానిపై ఎటువంటి స్టడీ జరగలేదు. బోధన్ ఫ్యాక్టరీలో యంత్రాలు ప దేండ్లుగా తుప్పుపట్టిపోయాయి. బోధన్ ఫ్యాక్టరీని ప్రారంభించాలనుకుంటే.. పాత యంత్రాలతోనే ప్రారంభిస్తారా.. లేదా అక్కడే కొత్త ప్లాంట్ నిర్మాణం చేస్తారా అనే విషయం ముందుగా తేలాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఫ్యాక్టరీ ఉన్నచోట కాకుండా మరోచోట కొత్తగా నిర్మించాలనుకుంటే ఆ విషయంపైనా స్పష్టతను ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలపై ఉన్నది.
నిజాం షుగర్స్ శక్కర్‌నగర్ యూనిట్ పునరుద్ధరణ జరగాలంటే ముడిసరుకు చెరుకు పంట అవసరం ఎంతో ఉన్నది. ఫ్యాక్టరీ మూతపడడంతో రైతులు పదేండ్లుగా చెరుకు సాగుకు దూరమయ్యారు. చక్కెర కార్మాగారాన్ని ప్రారంభిస్తాం.. చెరుకు పంటను వేయండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాటలను రైతులు విశ్వసించడంలేదు. ఎందుకంటే.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిజాం షుగర్స్ విషయంలో వ్యవహరించిన తీరును రైతులు గుర్తుచేసుకుంటున్నారు.
అప్పటికే ప్రైవేట్‌పరం అయిన నిజాం షుగర్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హామీ ఇచ్చి మాట తప్పింది. అప్పట్లో నిజాం షుగర్స్ ప్రైవేటీకరణలో జరిగిన అక్రమాలపై సభా సంఘాన్ని నియమించారు. సభాసంఘం తన నివేదికలో నిజాం షుగర్స్‌ను ప్రైవేట్ యాజమాన్యం నుంచి బేషరతుగా స్వాధీనం చేసుకోవాలని, ప్రైవేటీకరణలో అక్రమాలకు పాల్పడినవారిపై కేసులు నమోదుచేయాలని సిఫార్సుచేసింది.
అప్పట్లో ఏర్పాటు చేసిన సభాసంఘంలో ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘం నివేదికను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. అందుకే ఇప్పుడు కూడా నిజాం షుగర్స్ పునరుద్ధరణ విషయంలో కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాటలపై చెరుకు రైతులకు నమ్మకం కుదరడంలేదు. చెరుకు పండించాలంటూ రైతులను కోరుతున్న ప్రభుత్వం.. చెరుకు సాగుపై రైతులను చైతన్యవంతుల్ని చేయడానికి వ్యవసాయశాఖ లేదా ఉద్యానవనశాఖ ద్వారా ఎటువంటి కార్యాచరణ చేపట్టలేదు. ఆరు నెలల క్రితం బోధన్ నియోజకవర్గ రైతులకు చెరుకు సాగుపై ఒక సదస్సును ఏర్పాటుచేశారు.
సదస్సులో చెరుకు సాగుచేసే రైతులకు ఇచ్చే ప్రోత్సాహకాల విషయమై ఎటువంటి ప్రకటన చేయలేదు. రైతులు చెరుకు సాగు చేయాలంటే చెరుకు విత్తనం ఉచితంగా ఇవ్వడం, సబ్సిడీపై ఎరువులు ఇవ్వడం, సాగు కోసం రుణాలు మంజూరుచేయడం చేయాలి.. ఇటువంటి ప్రోత్సాహకాల ఊసే ఎత్తలేదు. నిజాం షుగర్స్ పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిపై రైతులకు అనేక అనుమానాలు ఉన్నాయి.. దీనికితోడూ చెరుకు సాగుచేస్తే ఇచ్చే ప్రోత్సాహకాల విషయంలో స్పష్టతలేకపోవడంతో చెరుకు సాగు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. నిజాం షుగర్స్ పునరుద్ధరణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. ముందుగా చెరుకు సాగుపై స్పష్టమైన కార్యాచరణ చేపట్టాల్సి ఉంటుందని పలువురు అంటున్నారు.