నిజామాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అట్టడుగువర్గాల అభ్యున్నతి కోసం జీవితమంతా తపించిన బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి ఒకవైపు.. స్వతంత్ర భారతంలో దళిత, గిరిజనుల ఉన్నతిని కాంక్షిస్తూ రాజ్యాంగరక్షణ కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి మరొకవైపు.. ఉమ్మడి జిల్లాలో దళితబంధు పథకం మంగళవారం ప్రారంభమైంది. శతాబ్దాలుగా చీకట్లో మగ్గిన కుటుంబాలకు పేదరికం నుంచి శాశ్వత విముక్తి కలిగించేలా, మెరుగైన జీవనోపాధి కల్పించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకరచన చేసిన కార్యక్రమం దళితబంధు. మంగళవారం నిజామాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బీర్కూర్, రుద్రూర్లో శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, కామారెడ్డిలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహనాలు, వాహనేతర యూనిట్లను అందుకున్న లబ్ధిదారుల ఆనందం అంతాఇంతా కాదు. ‘జై భీమ్.. జై కేసీఆర్’ అంటూ వారు నినదించారు.
తెలంగాణ గ్రామీణ జీవితంలో ప్రతి పల్లెలోనూ నిరుపేద కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఇందులో అత్యధిక శాతం దళిత సమాజానికి చెందినవే ఉన్నాయి. తరతరాలుగా ఆయా వర్గాలంతా పాలకుల నిర్లక్ష్యం మూలంగా అట్టడుగులోనే కొట్టుమిట్టాడుతున్నారు. సామాజిక వివక్షకు గురవుతూ, ఆర్థికంగా రాణించలేక చతికిల పడుతూ ఉండిపోతున్నారు. ఏడు దశాబ్దాల ఘనమైన స్వాతంత్య్ర భారతదేశంలో అలాంటి అభాగ్యుల జీవితాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఏండ్లుగా వారిని ఆయా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే చూశాయి. అవసరం ఉన్నప్పుడు ఆ వర్గాలను ఓటింగ్‌కు వాడుకోవడం తప్ప చేసిందేమీ లేదు.
షరామామూలే అన్నట్లుగా వారి పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించేది కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ దయనీయమైన దుస్థితికి చరమగీతం పాడేందుకు దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చారు. దళిత సమాజంలో పేద కుటుంబాలకు చెందిన వారిని ఉన్నతికి తీసుకు వచ్చేందుకు తెచ్చిన పథకం ఇప్పుడు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. మొత్తం ఉమ్మడి జిల్లాలో 900 లబ్ధిదారులకు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా యూనిట్లు పంపిణీ చేయగా, ఏప్రిల్ 14, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు మరికొంత మందికి యూనిట్లు అందించనున్నారు.
అంబేద్కర్ దేశానికి దిక్సూచి
అంబేద్కర్ దేశానికి దిక్సూచి. రాజ్యాంగ నిర్మాతగా బడుగు, బలహీన వర్గాలకు దేవుడిగా వెలుగొందుతున్నారు. రాజ్యాంగంలో దళిత, గిరిజనులకు ప్రాధాన్యతను అందించి ఆ వర్గాలను ఆదుకున్నారు. బాబూజగ్జీవన్ రామ్ సైతం దళిత ప్రజల అభ్యున్నతికి చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఈ మహానుభావుల అడుగు జాడల్లో రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ విధానంలో దళిత కుటుంబానికి రూ.10లక్షలు చొప్పున సాయం చేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తూ మెప్పు పొందుతున్నారు.
యావత్ దేశంలోని మిగిలిన రాష్ర్టాలన్నీ దళితబంధు పథకం అమలు తీరుతెన్నులను శ్రద్ధగా గమనిస్తుండడం విశేషం. దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను గుర్తు చేస్తూ, వారికి రాజ్యాంగ ఫలాలను అందిస్తూ అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ స్ఫూర్తిని కేసీఆర్ చాటిచెబుతున్నారు. అందుకే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో జరిగిన దళితబంధు కార్యక్రమంలో లబ్ధిదారులంతా జైభీమ్… జైకేసీఆర్ నినాదాలు హోరెత్తించడం విశేషం.
సమూల మార్పునకు వేదిక…
దళిత కుటుంబాల్లో మెరుగైన జీవనోపాధి లభించడం, శాశ్వతంగా పేదరికానికి దూరమయ్యేలా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రచన చేసిన పథకమే దళితబంధు. విశాలమైన దృష్టిలో విలక్షణమైన పథకంగా ఇప్పటికే దళిత బంధు పథకం కీర్తికెక్కింది. సర్కారు అందించే గ్రాంటు ద్వారా లబ్ధిదారుడు నికరంగా మంచి ఆదాయం పొందడానికి వీలైన యూనిట్ ప్రారంభించునే అవకాశం ఏర్పడింది. లబ్ధిదారులు కొంత మంది సమూహంగా ఏర్పడితే చిన్న లేక మధ్య తరహా పరిశ్రమనే పెట్టుకోవచ్చు. సర్కారు అందించిన రూ.10లక్షల నగదు తిరిగి చెల్లించాలనే భయం లేదు.
కిస్తీలు కట్టాలనే ఆందోళనే అక్కరలేదు. బాకీ కట్టాలనే రంది అస్సలే లేదు. యూనిట్ స్థాపనతో వచ్చిన రెవెన్యూతో సంబంధిత దళిత కుటుంబం సాఫీగా జీవనం సాగిస్తే సరిపోతుంది. గ్రామం, పట్టణంలో మిగిలిన సంపన్న కుటుంబాలకు దీటుగా బతికేందుకు దళితబంధు ద్వారా ఆసరా అవ్వడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ఉద్దేశం. అందుకే ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసి యూనిట్ విజయవంతం కావడానికి ప్రభుత్వం పర్యవేక్షణ, మార్గదర్శకం ఎల్లవేళలా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అణగారిన వర్గాల్లో ధైర్యం నింపే అన్ని అంశాలూ దళిత బంధులో కనిపిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది.
పౌల్ట్రీఫాం పెట్టుకుంటాం..
ఖలీల్‌వాడి, ఏప్రిల్ 5: దళితబంధు కింద రూ. 10 లక్షలు రావడం నాఅదృష్టంగా భావిస్తున్నా. పౌల్ట్రీఫాం పెట్టడానికి మా వద్ద డబ్బులు లేవు. అప్పు తీసుకుంటే వడ్డీ కట్టలేక పోయేవాళ్లం. ఇప్పుడు దళితబంధుతో ఇబ్బందులు దూరమయ్యాయి.
–ప్రియాంక, వాడి గ్రామం, ధర్పల్లి మండలం
మీ-సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తా..
పది లక్షల రూపాయలతో మీ సేవ ఆన్లైన్ సర్వీస్ పెట్టుకుంటా. సొంతంగా ఎవరినీ ఒక్కరూపాయి అడుగకుండా పెట్టుకుంటున్నాను అంటే సీఎం కేసీఆర్ దయవల్లే ఇదంతా. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.
–నరేశ్, అమీర్‌నగర్, (దమ్మన్న పేట్)