కామారెడ్డి, జనవరి 18: వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి దవాఖానల్లో పని చేసే కార్మికులకు రెండు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని వారు వాపోయారు. శానిటేషన్ పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డు, ఇతర కార్మికులు పనిభారంతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు.
వేతనాలు ఇవ్వకపోవడంతో ఇంటి కిరాయి చెల్లించలేక, నిత్యావసర వస్తువులు కొనలేక సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం కలెక్టరేట్ ఏవో సహిద్ అహ్మద్ మసూర్‌కు వినతిపత్రం అందజేశారు. మెడికల్ ఎంపాయిస్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు దశరథ్, ఏఐటీయూసి జిల్లా అధ్యక్షుడు బాలరాజు, రేణుక, గంగారాం, కాశీరావు, సురేఖ, సాయిబాబా, కల్యాణి, సంగీత, శారద, పోశవ్వ, మహేందర్, సాయిలు, సాయిబాబా పాల్గొన్నారు.