ఇందల్వాయి, నవంబర్ 7: కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించిన రైతులు రోజుల తరబడి వేచి చూడాల్సి న పరిస్థితి ఉత్పన్నం కాకుండా త్వరగా వడ్లను తూకం వేయించాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి, రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ శరత్ అధికారులకు సూచించారు. ధాన్యం సేకరణ కోసం ప్రభుత్వం విరివిగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. గురువారం ఆయన నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మం తు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్‌తో కలిసి ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్పల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనఖీ చేశారు. రైతులతో మాట్లాడి, ధాన్యం సేకరణ తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా ఇబ్బందులుంటే చెప్పాలని సూచించారు. సేకరించిన ధాన్యాన్ని వెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని, రవాణాపరమైన ఇబ్బందులు ఏర్పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు మాట్లాడుతూ సుమారు 8లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలనే లక్ష్యంతో జిల్లావ్యాప్తంగా 673 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు.
బోధన్, బాన్సువాడ ప్రాంతాల్లో మరో మూడు వారాల వరకు ధాన్యం కొనుగోళ్లు కొనసాగనుండగా, బాల్కొండ తదితర ప్రాంతాల్లో పంట దిగుబడులు కొంత ఆలస్యంగా వచ్చినందున డిసెంబర్ 15 వరకు కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచాల్సి వస్తుందని ప్రత్యేకాధికారి దృష్టికి తెచ్చారు.
నిర్ణీత గడువులోపు ఇంటింటి సర్వే పూర్తి చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేను నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి డాక్టర్ శరత్ సూచించారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన జిల్లా అధికారులతో సమావేశమై ఇంటింటి సర్వే ప్రగతిని సమీక్షించారు. ప్రతి ఇంటిని ఎన్యుమరేటర్లు సందర్శించి ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా పూర్తిస్థాయిలో పక్కాగా కుటుంబ వివరాలు సేకరించేలా చూడాలన్నారు.