కామారెడ్డి, మే 30: బడీడు పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు జూన్ 3 నుంచి 11 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నామని, అందులో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో బడిబాటలో భాగంగా రోజువారీ చేపట్టనున్న కార్యక్రమాలపై ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అధికారులకు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 3 చేపట్టే బడిబాటలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, తహసీల్దార్లు, ఎంపీపీలు, ఎంపీవోలు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని అన్నారు. జూన్ 3న విలేజ్ ఆర్గనైజర్లతో సమావేశం, 4న ఇంటింటికీ తిరిగి బడీడు పిల్లలను గుర్తించడం, 5 నుంచి 10 వరకు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి తల్లిదండ్రుల్లో చదువుపై అవగాహన కల్పించి పిల్లలను బడికి పంపించేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
11న గ్రామసభ ఏర్పాటు చేసి 3 నుంచి 10 వరకు చేపట్టిన కార్యక్రమాలపై చర్చించాలన్నారు. 12న పండుగ వాతావరణంలో పాఠశాలలను పునఃప్రారంభించి నూతన విద్యార్థులకు స్వాగతం పలకాలన్నారు. 13న తొలిమెట్టు, 14న సామూహిక అక్షరాభ్యాసం,15న గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, 18న డిజిటల్ తరగతులపై అవగాహన, 19న ఆటల పోటీలు నిర్వహించాలన్నారు. డీఈవో రాజు, నీలం లింగం, పంచాయతీ రాజ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
కామారెడ్డి,మే 30: జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై ఎస్పీ సింధూశర్మ, ట్రైనీ ఏఎస్పీ కాజల్ సింగ్లతో కలిసి గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 4,797మంది అభ్యర్థులు 12 కేంద్రాల్లో పరీక్ష రాయనున్నారని అన్నారు.
పరీక్షలు సాఫీగా నిర్వహించేందుకు నియమించిన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, రూట్ అధికారులు ముందుగా ఆయా కేంద్రాలను సందర్శించి మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. సెంటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తూ జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని అన్నారు. ఐడెంటిఫికేషన్ అధికారులు ఉదయం 9 నుంచి అభ్యర్థులను చెక్చేస్తూ పరీక్షా కేంద్రాలకు 10 గంటల వరకు అనుమతించాలని, ఆ తర్వాత ఎవరినీ అనుమతించొద్దని సూచించారు. సమావేశంలో ఆర్డీవో రంగనాథరావు, డీఈవో రాజు, నీలం లింగం,ఆర్టీఏ శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిర, విద్యుత్, మున్సిపల్ తదితరులు పాల్గొన్నారు.