కామారెడ్డి, సెప్టెంబర్ 27 : ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మ తు పనులను అక్టోబర్ 7లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. మినీ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్, వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్షించారు.
జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కాలువలు తదితర మరమ్మతు పనులకు సంబంధించిన ప్రతిపాదనల మేరకు పనులు పూర్తి చేయాలని, నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ స్థానిక కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన జిల్లాస్థాయి యువజనోత్సవాల్లో పాల్గొన్నారు. వివిధ పాఠశాశాలల విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్‌ను తిలకించారు. ఆర్డీవో రంగనాథ్ రావు, డీఈవో రాజు, జిల్లా యువజన అధికారి జగన్నాథ్ పాల్గొన్నారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో అవసరమైన అత్యవసర మరమ్మతులు ఉంటే సంబంధిత ఇంజినీరింగ్ విభాగం అధికారులు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ అధికారులు, పంచాయతీరాజ్, ఈడబ్ల్యూడీసీ సంబంధిత ప్రిన్సిపాల్, వసతి గృహాలు, సంక్షేమ అధికారులు, కేజీబీవీ ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు.
తాగునీరు సమస్య ఉంటే వెంటనే పరిష్కరించే దిశగా ప్రతిపాదించాలని సూచించారు. వసతి గృహాలు, పాఠశాలల్లో సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత సీనియర్ అధికారికి వివరించాలన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.