కామారెడ్డి రూరల్, నవంబర్ 9: సమాజానికి విద్యార్థులే దిక్సూచి అని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. చదువుకునే వయస్సులోనే విద్యార్థులు మంచి నడవడిక అలవర్చుకోవడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించడంతో పాటు సమాజాన్ని బాగు చేయవచ్చన్నారు. కామారెడ్డిలోని ఓ ఫంక్షన్హాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన పబ్లిక్ సేఫ్టీ అంబాసిడర్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ప్రజల శ్రేయస్సు కోసం ఎస్పీ సింధూశర్మ చొరవతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఇందులో ఎంపికైన వారంతా మంచి నడవడికతో వ్యవహరించడంతో పాటు బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత సమాజంపై అవగాహన ఉండాలన్న ఆలోచనతోనే ‘బ్రాండ్ అంబాసిడర్’కు శ్రీకారం చుట్టామని ఎస్పీ సింధూశర్మ తెలిపారు. సమాజానికి ఏదైనా మంచి చేయాలనే బలమైన ఆలోచనతో ఉంటారనే విద్యార్థులు, యువకులను ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు.
ఎంపికైన వారిని సైబర్‌సేఫ్టీ క్లబ్, రోడ్ సేఫ్టీ క్లబ్, ఉమెన్ సేఫ్టీ క్లబ్, యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్ కమిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ క్లబ్, హెల్త్ అండ్ వెల్నెస్ క్లబ్లో చేర్చి ఆయా అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒక్కో క్లబ్లో విద్యార్థులు ఆరుగురు, తల్లిదండ్రులు నలుగురు, ఒక అధ్యాపకుడు ఉంటారని వివరించారు. ఆరు సేఫ్టీ క్లబ్‌లలో మొత్తం 21 కాలేజీల నుంచి వెయ్యి మందికి పైగా నియమించామని, వారికి ఆరు అంశాల్లో అవగాహన కల్పిస్తామన్నారు. భవిత్యత్తు గురించి ఆలోచించినప్పుడు మన భద్రత గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలిపారు. డీఎస్పీ నాగేశ్వర్రావు, సీఐలు చంద్రశేఖర్‌రెడ్డి, రామన్, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు పాల్గొన్నారు.