కామారెడ్డి, డిసెంబర్ 5 : స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను లక్ష్యానికి అనుగుణంగా మంజూరు చేయాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో రెండో త్రైమాసిక బ్యాంకర్ల జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. జిల్లాలో స్వల్ప, దీర్ఘకాలిక, మౌలిక సదుపాయాల రుణాలు, విద్యా, గృహ, స్వయం సహాయక బృందాలకు రుణాలు, ఇతర ప్రాధాన్యత పథకాలకు సంబంధించిన వాటిపై కలెక్టర్ సమీక్షించారు. రెండో త్రైమాసికంలో సాధించిన ప్రగతి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి సాధించాల్సిన ప్రగతిలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.
వార్షిక క్రెడిట్ ప్లాన్ 4,695 కోట్లు కాగా సెప్టెంబర్ మాసాంతం వరకు 2030 కోట్లు రుణాలు మంజూరు చేసినట్లు చెప్పారు. నిర్ణయించిన ప్రగతి సాధించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, నాబార్డ్ డీడీఎం ప్రవీణ్, భారత రిజర్వ్ బ్యాంక్ ఏజీఎం రహమాన్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ రవికాంత్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, వివిధ శాఖల అధికారులు, బ్యాంకుల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.
సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీలో వార్డు నంబర్లను సరిచేయాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఆర్డీవోలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇటీవల సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీలో వార్డు నంబర్లు తప్పుగా నమోదు అయ్యాయని, ఓటరు జాబితా, ఇంటి నంబర్ల ప్రకారం వార్డు నంబర్ వేసి సరిచేయాలని సూచించారు.
ఇందుకు పంచాయతీ సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. మున్సిపల్ వార్డుల్లో నంబర్లను కూడా సరిచేసుకోవాలని చెప్పారు. నియోజకవర్గంలోని పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించాలని తహసీల్దార్లు, ఈఆర్వోలను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు విక్టర్, శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో రంగనాథ్ రావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రావు, సీపీవో రాజారాం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.