గిరిజన తండాలు తళుకులీననున్నాయి. మారుమూల ప్రాంతాలకు కొత్త రహదారులు రానున్నాయి. ఎక్కడో విసిరేసినట్లుండే ఆవాసాలకు సైతం రోడ్డు కనెక్టివిటీ పెరగనున్నది. సమైక్య పాలనలో గిరిజన గూడేలు అభివృద్ధికి నోచుకోలేదు. వాటిని గత పాలకులు పట్టించుకోలేదు. కరెంట్, తాగునీరు, రహదారులు, ఇతర మౌలిక వసతులు కల్పించలేదు. కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక, సీఎం కేసీఆర్ వచ్చాక గిరిజన ప్రాంతాల రూపురేఖలు మారిపోయాయి.
తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడంతో అవి ప్రగతిపథంలో దూసుకెళ్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లోనూ వందలాది కిలోమీటర్ల మేర బీటీ, సీసీ రోడ్లు నిర్మించడంతో కనెక్టివిటీ పెరిగి అభివృద్ధి బాట పట్టాయి. తాజాగా మరిన్ని తండాలకు రోడ్లు వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలోని 16 రోడ్ల నిర్మాణానికి రూ.26.40 కోట్లు మంజూరు చేశారు. దీంతో బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల ప్రజలకు మేలు చేకూరనున్నది. రోడ్ల నిర్మాణానికి దండిగా నిధులు ఇచ్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలు బుధవారం పలుచోట్ల ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా కేంద్రాలకు, అక్కడ్నుంచి రాష్ట్ర రాజధానికి వెళ్లే రహదారులకు అతీగతీ ఉండకపోయేది. స్వరాష్ట్రంలో రహదారుల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతున్నది. గ్రామం నుంచి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి, జిల్లా నుంచి రాష్ట్ర రాజధాని ఇలా వరుసగా ప్రాధాన్య క్రమంలో రోడ్లను వేసి ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. దీంతోపాటు గిరిజన ఆవాసాలకు రోడ్డు కనెక్టివిటీని విపరీతంగా పెంచారు. తాజాగా మరోమారు రాష్ట్ర వ్యాప్తంగా తండాలకు బీటీ రోడ్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. గిరిజన సంక్షేమ శాఖ నిధులతో చేపట్టనున్న బీటీ రోడ్ల నిర్మాణాల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు పలు రోడ్లు మంజూరయ్యాయి. ఇందులో బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల పరిధిలో 16 పనులున్నాయి. వీటికి రూ.26.40కోట్లు వెచ్చించబోతున్నారు. తద్వారా తండాల నుంచి ఆర్అండ్బీ రోడ్లకు కనెక్టివిటీ పెరగడంతోపాటు గిరిజన ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగబోతున్నది. వీరంతా వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు మార్గం సుగమం కానున్నది. ప్రజల అవసరాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించిన పిమ్మటే బీటీ రోడ్లను మంజూరు చేశారు.
తండాలకు మహర్దశ
తండాలంటే ఊరికి చివరన, ఎక్కడో కొండల్లో, గుట్టల్లో పడేసినట్లు విస్తరించిన చిన్నపాటి ఆవాస కేంద్రాలు. ఒకే రకమైన సంస్కృతి, సంప్రదాయాలు కలగలిసిన వ్యక్తుల సమూహంతో ఏర్పడిన శ్రమైక జీవనమే తండాల సొంతం. వ్యవసాయం, అడవితల్లిని నమ్ముకొని జీవనం సాగించే తండాల్లో స్వతంత్ర భారతావనిలో ఏనాడు, ఏ పాలకులూ కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. అలాంటి తండాలు, గూడెలకు పంచాయతీ పరిపాలనను చేరువ చేయాలని దశాబ్ద కాలం క్రితమే తలచిన సీఎం కేసీఆర్.. గిరిజనుల ఎన్నో ఏండ్ల కలను సాకారం చేశారు. మా పాలన… మా తండా… అన్న నినాదంతో అధికార వికేంద్రీకరణ ఫలాలను తండాలకు చేర్చిన ఘనత తెలంగాణ సర్కారుకే దక్కింది.
ఆదివాసీ గూడేలు, లంబాడి తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తూ 2018, మార్చి 28న చట్టం తెచ్చింది. ఈ చట్టం ప్రకారం కొత్తగా తండాలు, గూడేలు గ్రామ పంచాయతీలుగా మారి 2019లో పాలకవర్గాలు అధికారాలను చేపట్టాయి. ప్రస్తుతం గిరిజన గ్రామ పంచాయతీల్లో పరిపాలన స్థానిక గిరిజనుల చేతుల మీదుగానే అద్భుతంగా సాగుతున్నది. వారి అవసరాలను తీర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆది నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ కొండంత అండగా నిలుస్తున్నది. గ్రామాలే దేశానికి వెన్నెముక అన్న మహాత్మా గాంధీ మాటలు రాష్ట్రంలో అచ్చంగా అమలవుతున్నాయి. పల్లెలకు ప్రాణం పోస్తూ కేసీఆర్ సర్కారు పని చేస్తున్నది. గిరిజన తండాలకు స్వపరిపాలన కాంతులను అందించడంతోపాటు బీటీ రోడ్లతో మౌలిక సదుపాయాల కల్పనకు కేసీఆర్ చొరవ తీసుకోవడంపై గిరిజనులంతా హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు.
సంతోషంగా ఉన్నది..
బాన్సువాడ రూరల్, సెప్టెంబర్ 6: పోచారం నుంచి పోచారం తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉంది. బీటీ రోడ్డు నిర్మాణంతో ఎంతో మేలు చేకూరుతుంది. గిరిజనతండాల్లోని రోడ్లకు అత్యధిక నిధులు మంజూరు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ సార్ ప్రభుత్వం. తండాలను కొత్త గ్రామ పంచాయతీలుగా మార్చడంతోపాటు ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తున్నది. నిధులు మంజూరు చేయించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు.
– హర్జ్యానాయక్, పోచారం తండా
ఇబ్బందులు తీరుతాయి..
బాన్సువాడ రూరల్, సెప్టెంబర్ 6: బోర్లం క్యాంపు నుంచి బోర్లం గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో రెండు గ్రామాల ప్రజల ఇబ్బందులు తీరుతాయి. పాత రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. బోర్లంక్యాంపును జీపీగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం గ్రామాభివృద్ధికి, జీపీ భవనానికి నిధులు మంజూరు చేసింది. భవన నిర్మాణం సైతం పూర్తయ్యింది. బోర్లం క్యాంపు నుంచి బోర్లం వరకు బీటీరోడ్డు వేయడంతో గట్టు మీది గ్రామాలైన హన్మాజీపేట్, కోనాపూర్, సంగోజీపేట్, కద్లాపూర్ తదితర గ్రామాల ప్రజలకు మేలు చేకూరుతుంది. ఈ రోడ్డు గుండానే వారు బాన్సువాడకు సాఫీగా వెళ్తారు. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– నరేందర్, బోర్లం క్యాంపుతండా
రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది..
నస్రుల్లాబాద్, సెప్టెంబర్ 6: ప్రభుత్వం రోడ్లు వేయనుండడంతో రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది. సమైక్య పాలనలో తండాలకు రోడ్లు వేయాలని ఏ ప్రభుత్వాలూ ఆలోచించలేదు. మమ్మల్ని పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ తండాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే రోడ్లపై ప్రత్యేక దృష్టిసారించి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డికి రుణపడి ఉంటాం.
– కొల్లె బస్వారెడ్డి, హాజీపూర్
తిప్పలు..తప్పుతాయి..
నస్రుల్లాబాద్, సెప్టెంబర్ 6: గతంలో నాచుపల్లి గ్రామానికి వెళ్లాలంటే గుంతల రోడ్డుతో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్లం. మా గ్రామానికి నూతనంగా రోడ్డు వేయడంతో తిప్పలు తప్పాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాకే రోడ్లకు మహర్దశ వచ్చింది. ఇప్పుడు తండాలకు కూడా బీటీ రోడ్లు వేస్తుండడంతో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులుండవు.
– గంపల శంకర్, నాచుపల్లి