రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థుల మొదటి జాబితాను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సోమవారం విడుదల చేశారు. ఇందులో ఉమ్మడి జిల్లా నుంచి కామారెడ్డి మినహా అన్ని నియోజకవర్గాలకు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల పేర్లను ప్రకటించారు. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయనున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పలు మండలాల్లో ర్యాలీలు నిర్వహించారు. పార్టీ కార్యాలయాల వద్ద నాయకులు, కార్యకర్తలు పటాకులు కాలుస్తూ సంబురాలు చేసుకొన్నారు. మిఠాయిలు తినిపించుకొని నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి నుంచి కేసీఆర్ను లక్షకుపై చిలుకు మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ విజయం ఖాయమని పేర్కొన్నారు.
– నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఆగస్టు 21