నిజామాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):కామారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. రెండు సెట్ల నామినేషన్లను స్థానిక నాయకులతో కలిసి ఆర్వో శ్రీనివాస్‌రెడ్డికి సమర్పించారు. మొదటి సెట్‌ను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, బీఆర్ఎస్ న్యాయ సలహాదారు సోమ భరత్‌తో సీఎం నామినేషన్లు అందించారు. రెండో సెట్లో ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ కొమ్ముల తిర్మల్ రెడ్డి, పున్నా రాజేశ్వర్, ఎంజీ వేణుగోపాల్ గౌడ్, మామిళ్ల అంజయ్యతో కేసీఆర్ తన నామినేషన్లను సమర్పించారు. నామినేషన్ సమర్పణకు కేసీఆర్ వెంట స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, వకీల్ రామారావు సైతం హాజరయ్యారు. అనంతరం ప్రజా ఆశీర్వాద సభలో ప్రజనుద్దేశించి కేసీఆర్ 37 నిమిషాల పాటు ప్రసంగించి కామారెడ్డి భవిష్యత్తు అభివృద్ధిపై హామీ ఇచ్చారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తన అసెంబ్లీ స్థానాన్ని త్యాగం చేసి తనకు అవకాశం ఇచ్చారని సభా వేదికపై సీఎం గుర్తు చేశారు. గంప గోవర్ధన్ రాజకీయ భవిష్యత్తును చూసుకునే బాధ్యత తనదేనంటూ కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ ప్రసంగానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ప్రజా ఆశీర్వాద సభకు భారీగా నియోజకవర్గ ప్రజలు హాజరయ్యారు. బీడీ కార్మికులకు 2014 కటాఫ్‌ను ఎత్తేసి కొత్త వారికి కూడా పింఛన్లు అందిస్తామని కామారెడ్డి వేదికగా కేసీఆర్ హామీ ఇచ్చారు.
ప్రజా ఆశీర్వాద సభకు వచ్చిన జనాన్ని చూసి కేసీఆర్ మురిసిపోయారు. అశేష జనానికి నమస్కారం అంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. తనను కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు దీవించేందుకు వచ్చిన ప్రజలందరికీ సంతోషంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కామారెడ్డికి కేసీఆర్ వస్తే… అన్నీ వస్తాయన్నారు. పరిశ్రమలు, సౌకర్యాలు, అభివృద్ధి ఇలా ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. కామారెడ్డిని బంగారు తునకగా మార్చే బాధ్యత తనదేనని చెప్పారు. కేసీఆర్ వెంట చాలా వస్తాయని ప్రజల ఊహకు అందని విధంగా కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. ఏడాదిన్నర కాలంలోనే గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ -22లో భాగంగా కామారెడ్డి, ఎ ల్లారెడ్డి నియోజకవర్గాలకు మళ్లిస్తామన్నారు. గోదావరి జలాలతో ఈ ప్రాంత రైతులకు సాగు నీటి కొరత లేకుండా చూసే బాధ్యత కూడా తనదేనం టూ ప్రజలకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. పల్లెల రూపు రేఖలు మారుతాయన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు అభ్యర్థి వెనుకున్న పార్టీలను ప్రజలు గమనించాలన్నారు.ఆ పార్టీలు గతం లో ఈ ప్రాంతానికి ఏమి చేశాయో చూడాలన్నారు.

కామారెడ్డితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ ప్రజలకు వివరించారు. బీబీపేట మండలంలోని పోసానిపల్లి నేటి కోనాపూర్ తన తల్లిగారి స్వగ్రామం అంటూ వివరించారు. తన చిన్నతనంలో ఈ ప్రాం తంలో తన తల్లి, కుటుంబీలతో కలిసి తిరిగిన ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆరుగొండలో తన మేనమామలు ఉంటారని కేసీఆర్ చెప్పారు. వారి వద్దకు వచ్చి వెళ్లే క్రమంలో కామారెడ్డి పట్టణంలోనూ మా ర్వాడీ కుటుంబానికి చెందిన బాదల్ సింగ్ వారి ఇంట్లో నూ ఉండేదని చెప్పారు. అడ్తి నిమ్మల జీవన్ రెడ్డితోనూ తమ కుటుంబానికి స్నేహపూర్వక సంబంధం ఉందని కేసీఆర్ తెలిపారు. ఉద్యమ సమయంలోనూ కామారెడ్డితో ప్రత్యేకమైన అనుబంధం ఉండేదని వివరించారు. జల సాధన ఉద్యమంలో భాగంగా కామారెడ్డి నుంచే బ్రిగేడియర్‌గా పని చేసే అదృష్టం తనకు దక్కిందని కేసీఆర్ తెలిపారు. ఉద్యమంలో గులాబీ పార్టీ కోసం కూలీ పనిగానూ దేశాయి బీడీ కంపెనీలో పని చేసినట్లుగా బీఆర్ఎస్ అధినేత గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో తన బావ వకీల్ రామారావు, మరో న్యాయవాది తిరుమల్ రెడ్డిలు కలిసి బార్ అసోసియేషన్‌లో ఏకగ్రీవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తీర్మానం చేసిన విషయాన్ని కేసీఆర్ వివరించారు. ఉప్పెనలా జరిగిన ఉద్యమంలో కామారెడ్డి పాత్ర అనితరసాధ్యమైందన్నారు.
బీజేపీకి ఓటు అడిగే హక్కే లేదని కేసీఆర్ స్పష్టం చే శారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ రాజ్యాంగ బద్ధంగా రాష్ర్టానికి రావాల్సిన నిధులు, విద్యా సంస్థలను మంజూరు చేయడం లేదని, పైగా అభివృద్ధిని అడ్డుకునేందుకు నిత్యం తెలంగాణ ప్రభుత్వ కాళ్లలో కట్టె పెట్టినట్లు ప్రవర్తించిందని చెప్పారు. కేంద్ర చట్టం ప్రకారం కొత్త జిల్లాల్లో నవోదయ పాఠశాలలను విధిగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వానికి ఉన్నప్పటికీ పదేండ్ల కాలంలో మోదీ ప్రభుత్వం తా త్సారం చేసిందే తప్ప ఎక్కడా చట్టాన్ని అమలు చేయలేదని కేసీఆర్ తెలిపారు. విభజన హా మీలను తుంగలో తొక్కిందన్నారు. మెడికల్ కాలేజీలను దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో మంజూరు చేసినప్పటికీ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఒక్కటీ ఇవ్వలేదన్నారు. కామారెడ్డిలో ఎవడైనా బీజేపోడు వచ్చి ఓటు వెయ్యమంటే గల్లా పట్టి అడగాలని ప్రజలకు సూచించారు. తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని చెప్పారు. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని, పెట్టకపోతే తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే నిధులను ఆపుతామని ప్రధాని స్వయంగా బెదిరించినా రైతుల కోసం మోదీ సూచనను పట్టించుకోలేదన్నారు. మోటర్లు పెట్టనందుకు రూ.25వేల కోట్లు కేంద్రం నిలిపివేసిందన్నారు. తెలంగాణపై మోదీ పగ పట్టిండన్నారు. అలాంటి బీజేపీకి ఓటెయ్యొద్దన్నారు. ప్రజా ఆశీర్వాద సభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కె.కేశవరావు, ఎంపీ బీబీపాటిల్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, రఘోత్తం రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్నా రాజేశ్వర్, మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి, బీఆర్ఎస్ నేతలు కాసాని జ్ఞానేశ్వర్, బొంతు రామ్మోహన్, దఫేదార్ రాజు, వకీల్ రామారావు(కేసీఆర్ బావ), తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి, నిట్టువేణు, నియోజకవర్గ జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి నుంచి తనను పోటీ చేయాలంటూ తన అసెంబ్లీ స్థానాన్ని త్యాగం చేసిన గంప గోవర్ధన్‌ను కేసీఆర్ మెచ్చుకున్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన గంప గోవర్ధన్.. తనను పోటీకి పిలవడం ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు. గంప రాజకీయ భవిష్యత్తుకు తనదే బాధ్యత అంటూ కేసీఆర్ వెల్లడించారు. పెద్ద అవకాశమే గంపను వరిస్తుందని సీఎం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపైనా కేసీఆర్ విరుచుకు పడ్డారు. ఎద్దు, ఎవుసం తెలియని వ్యక్తి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ధరణిని రద్దు చేస్తామంటూ రాహుల్ గాంధీ మాట్లాడడాన్ని తప్పుపట్టారు. ధరణిని రద్దు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలన్నారు. రైతులకు 24గంటల కరెంట్ వద్దు… 3గంటల కరెంట్ చాలన్న వ్యక్తే కామారెడ్డిలో తనపై పోటీకి నిలబడడం విడ్డూరమన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలంతా ఆలోచనతో ఓటెయ్యాలన్నారు. 2014కు మునుపు తెలంగాణలో చేనేత కార్మికులు, రైతుల ఆత్మహత్యలు, వలసలు, బీడు బారిన భూములు, కరెంట్ లేక, సాగు నీటి కటకట, తాగునీటి గోసతో ఇబ్బందులు పడిన పరిస్థితులను కేసీఆర్ వివరించారు. పదేండ్ల తెలంగాణ ప్రభుత్వ పాలనలో మారిన పరిస్థితులన్నీ ప్రజల ముందే ఉన్నాయన్నారు.