శక్కర్‌నగర్, జనవరి 17 : జిల్లాలోని రైలు మార్గాలు, రైల్వే స్టేషన్లపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. సౌకర్యాలను మెరుగుపర్చాల్సింది పోయి రైల్వే స్టేషన్లే మూసివేస్తున్నది. ముఖ్యంగా బోధన్- నిజామాబాద్ మధ్య ఉన్న పలు స్టేషన్లను మూసివేశా రు. శక్కర్‌నగర్, గాంధీపార్క్, ఎడపల్లి రైల్వే స్టేషన్లు ఎత్తివేయడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2019లో నిజామాబాద్ నుంచి బోధన్ వరకు కొనసాగిన పలు రైళ్లను పట్టాల మార్పు పేరుతో రద్దు చేశారు. అనంతరం పనులు జరుగుతున్న క్రమంలోనే స్టేషన్లను సైతం మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇటీవలే బోధన్ నుంచి మహబూబ్‌నగర్‌కు రైలు ప్రారంభం కాగా, మధ్యాహ్నం రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలు వస్తున్నా ఇది బోధన్ ప్రాంత ప్రజలకు ఎందుకూ పనికి రాకుండా పోయింది. కేవలం రైలును శుభ్రం చేసేందుకు మాత్రమే బోధన్ వరకు కొనసాగిస్తున్నారు. రైళ్లు ప్రారంభమైనా స్టేషన్లు మూసివేయడం తో ఈ సౌకర్యాన్ని వినియోగించుకోలేక పోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏండ్ల చరిత్ర కలిగిన ఈ స్టేషన్లను ఎత్తివేయడంతో హైదరాబాద్‌కు వెళ్లాలంటే బోధన్ రైల్వే స్టేషన్‌కు తెల్లవారు జామున రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ రైలును వినియోగించుకోవాలంటే దూరప్రాంతాల నుంచి వచ్చేవా రు ఆటోల్లో రావాలంటే ట్రైన్ చార్జీల కన్నా ఎక్కువగా ఆటోలకే చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా రైల్వేస్టేషన్లు..
రైల్వేశాఖ అధికారులు రద్దు చేసిన రైల్వేస్టేషన్లు జూదరులకు, మద్యం సేవించే వారికి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. మూడేండ్లకు పైగా కన్నెత్తి చూసేవారు లేక శక్కర్‌నగర్, గాంధీపార్క్, ఎడపల్లి రైల్వేస్టేషన్లు శిథిలావస్థకు చేరాయి. అయితే, ఈ స్టేషన్లు గ్రామాలకు దూరంగా ఉండడం.. పర్యవేక్షించేవారు లేక ఎవరి అవసరాలకు వారు వాడుకుంటున్నారు. శక్కర్‌నగర్, ఎడపల్లి రైల్వే స్టేషన్లు పేకాట స్థావరాలుగా, మద్యం బాబులకు అడ్డాగా మారాయి. ఈ స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో పిచ్చిమొక్కలు పెరగడంతో పాటు, విద్యుత్ సౌకర్యం తొలగించడంతో అసాంఘిక కార్యకలాపాలకు అనుకూలంగామారింది. రైల్వే స్టేషన్లను పునరుద్దరించాలంటూ ఇటీవల బోధన్‌కు వచ్చిన రైల్వేశాఖ డీఆర్ఎం శరత్చంద్రయాన్కు పలువురు ఇచ్చిన వినతిపత్రాలు బుట్టదాఖలు అయ్యాయి. ఇదిలా ఉంటే నిజామాబాద్- పెద్దపల్లి మధ్య ఉన్న పలు రైల్వేస్టేషన్లు సైతం నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాల్సిన రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదు.