ఖలీల్‌వాడి/బోధన్, అక్టోబర్ 14: ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు మూతబడ్డాయి. ఆయా కళాశాలల యాజమాన్యాలు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగాయి. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలనే డిమాండ్‌తో బంద్ పాటిస్తున్నాయి. దీంతో తొలి రోజు ఉమ్మడి జిల్లాలోని 54 డిగ్రీ కాలేజీలు తెరుచుకోలేదు. యాజమాన్యాల సమ్మె నేపథ్యంలో 30 వేల మందికి పైగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
కళాశాలలు నిరవధికంగా బంద్ పాటిస్తే తమ పిల్లలు నష్టపోతారని పిల్లల తల్లిదండ్రులు ఆవేదనకు లోనవుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయక పోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ అంబోజి హరిప్రసాద్ తెలిపారు. భవనాలకు అద్దె, అధ్యాపకులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. నిధులు ఇవ్వక పోవడం వల్ల కళాశాలలు మూసుకునే పరిస్థితి ఉందని అసోసియేషన్ సలహాదారు మారయ్యగౌడ్ పేర్కొన్నారు.
దసరా సెలవుల తర్వాత సోమవారం పునఃప్రారంభం కావాల్సిన డిగ్రీ, పీజీ కాలేజీలు తెరుచుకోలేదు. నిజామాబాద్, బోధన్, కామారెడ్డి తదితర పట్టణాల్లో కళాశాలలను మూసి ఉంచారు. బోధన్‌లోని ఉషోదయ, ఎస్వీ, విజయసాయి కాలేజీలను మూసివేశారు. డిగ్రీ, పీజీ కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలను ప్రభుత్వం ఇవ్వడం లేదని, నిరవధిక బంద్ కొనసాగిస్తామని ఆయా కళాశాలల కరస్పాండెంట్లు సూర్యప్రకాశ్, సాయిరెడ్డి, జావీద్ తెలిపారు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల కోసం పలువురు మంత్రులను, అధికారులను కలిసినా ప్రయోజనం లేకపోవడంతో, బంద్ పాటించక తప్పడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫీజు రీ యింబర్స్‌మెంట్ , ఉపకార వేతన బకాయిలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.