భీమ్‌గల్, ఆగస్టు 7: మండల కాంగ్రెస్‌లో వర్గపోరు బయటపడింది. ఇటీవల ఓ నాయకుడు పేకాటాడుతూ పోలీసులకు చిక్కడంతో పార్టీలో పేకాట పంచాయితీ చిచ్చుపెట్టింది. ఇప్పటికే బాల్కొం డ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్‌రెడ్డి మధ్య మూడు ముక్కలాటగా సాగుతున్న వర్గపోరు తాజాగా మండల స్థాయి నాయకుల మధ్య రాజుకుంటున్నది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు మండల నాయకులు కాంగ్రెస్‌లో చేరగా..వీరిద్దరి మధ్య వైరం ఉప్పు, నిప్పులా సాగుతున్నది. దీంతో పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి.
ఇందుకు కారణం పార్టీ ముఖ్య నాయకుడు, త్వరలో నిర్వహించనున్న ఎన్నికల్లో ముఖ్యమైన పదవిని చేజిక్కించుకోవాలని పావులు కదుపుతున్న నేత ఇటీవల పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. సదరు నాయకుడు అధికార పార్టీలో ఉండడంతో ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా పోలీసులు సైతం సహకరించారు. పోలీసులు కూడా భవిష్యత్తులో తమకు ఎలాంటి అపవాదు రాకుండా ఉండేందుకుగాను ముందు జాగ్రత్త పడ్డారు. చట్టపరంగా కేసు నమోదు చేసి, గుట్టుచప్పుడు కాకుండా ఏడుగురు పేకాటరాయుళ్లను కోర్టులో హాజరుపర్చి జరిమానాతో చేతులుదులుపుకున్నారు.
అయితే ఈ విషయా న్ని పార్టీలోనే ఉన్న సదరు నాయకుడి ప్రత్యర్థి బయట ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ప్రత్యుర్థులు సైతం దీనిని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రోడ్డు పక్కన పొదల్లో, వాహనాల అడ్డాల వద్ద జూదం ఆడే చిన్న చిన్న వారిని పట్టుకున్నప్పుడు మీడియాకు ప్రకటన రూపంలో తెలియజేసే పోలీసులు, ఈ సంఘటనను రిలీజ్ చేయకుండా గోప్యత పాటించారు. దీంతో సదరు ప్రత్యర్థి నాయకుడు మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి కేసులు అయినప్పటికీ వార్తలు ఎందుకు రావడంలేదంటూ ప్రచారం ప్రారంభించాడు. దీంతో పార్టీ పరువు గంగలో కలుస్తున్నదని నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ప్రజల్లో అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరువు ఈ ఘటనతో బజారున పడింది. ఈ ఇద్దరు నాయకులు గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వర్గ పోరుతో పార్టీకి నష్టం చేసి మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పట్టణంలో చేసిన అభివృద్ధిని సైతం మసకబర్చారనే ఆరోపణలు ఉన్నాయి.