పెద్ద కొడప్గల్: పెద్ద కొడప్గల్ (Pedda Kodapgal ) మండలంలోని జగన్నాథ్ పల్లి గ్రామంలో సీసీ రోడ్డు (CC Roads ) నిర్మాణం విషయంలో ఇరు వర్గాల ఘర్షణలో ముగ్గురు గాయపడ్డారు. గ్రామస్థులు,పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలోని జగన్నాథ్ పల్లి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ (NREGS ) నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు.
ఈ విషయంలో స్థలం తమది అంటే తమదని ఇరు వర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. మాట మాటపెరిగి రెండు వర్గాల వారు రెచ్చిపోయి ఇటుకలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో కొందరికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం పోలీసులకు చేరడంతో ఎస్సై మహేందర్ ( SI Mahendar ) ఘటన స్థలానికి చేరుకొని ఘర్షణకు కారణమైన పరిస్థితిపై విచారణ చేపట్టారు. హుషార్ సింగ్ అనే గ్రామస్థుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు.