Kotagiri | కోటగిరి, మార్చి 13 : చెస్ ఆట విద్యార్థుల మేధస్సు వికాసానికి బాట వేస్తుందని చెస్ నెట్ వర్క్ సంస్థ ప్రతినిధి మర్రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో హై స్కూల్ కాంప్లెక్స్ లో మండల పరిధిలోని ప్రతీ పాఠశాలకు, కేజీబీవీలకు, రెసిడెన్షియల్ పాఠశాలలకు చెస్ బోర్డులను శుక్రవారం పంపిణీ చేశారు.
ప్రతీ 20 మంది విద్యార్థులకు ఒక బోర్డు చొప్పున మండలంలో 120 బోర్డులను అందించినట్లు చెప్పారు. చెస్ నెట్వర్క్ సంస్థ ప్రతినిధి మర్రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సుధీర్ కోరాటి(కెనడా) స్థాపించిన చెస్ నెట్ వర్క్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు చెస్ ఆట ఆడెందుకు ప్రోత్సహించాలని ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇచ్చేసాట అలవర్చితే వారి మేథస్సు వికాసానికి బాటలు వేసినట్లేనని భావించి ప్రతీ ప్రభుత్వ పాఠశాలకు చెస్ బోర్డులను అందిస్తున్నామని వారు పేర్కొన్నారు. విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే చెస్ ఆటను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని వారు కోరారు. చెస్ ఆట వల్ల విద్యార్థులకు ఏకాగ్రత సృజనాత్మకత పెంపొదిస్తాయని, చెస్ అట అలవర్చుకున్న విద్యార్థి జీవితాల్లో వెలుగులు నిండుతాయని, అందరూ మేథో క్రీడ అయిన ‘చెస్ ఆటను అడుదాం.. ఆడిద్దాం’ అని పిలుపునిచ్చారు.
ముఖ్య వక్తగా హాజరైన విద్యార్థి సంఘ నాయకుడు ఆర్ గౌతమ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు డిజిటల్ వ్యాసనానికి దూరం చేయడానికి చెస్ ఆట ప్రత్యామ్నాయమని, విద్యార్థులకు నిర్ణయాత్మక శక్తిని అందిస్తుందని, విద్యార్థుల మెదడుకు చెస్ ఆట ఒక వ్యాయామం లాంటిదని చెప్పారు. విద్యార్థులందరూ చెస్ ఆటను అలవర్చుకొని చెస్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు బర్ల సాయులు, గంగారాజు, ఉదయ్ చందర్, కృష్ణమోహన్, పాషా, సంతోష్, బస్వంత్, శరత్ కుమార్, రూప, సుమలత, భూలక్ష్మి, వినీల, ఎమ్మార్సీ సిబ్బంది రాజేష్, మోహన్, సుధాకర్, జైవీర్ హనుమంతు పాల్గొన్నారు.