NRI | ఆర్మూరు : ఈనెల 23 జగిత్యాల డీఎల్ గార్డెన్స్ లో నిర్వహించతలపెట్టిన గల్ఫ్ గోస సభను విజయవంతం చేయాలని ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు కోరారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రవాస భారతీయుల సంక్షేమ వేదిక కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కోటపాటి తో పాటు గల్ఫ్ ఎన్ఆర్ఐ ఎల్లుల్ల నరేష్ (దుబాయ్) మాట్లాడారు. గల్ఫ్ ముఖ్య వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో బూత్కూరికాంత, ఊరుమల్ల విశ్వం నాయకత్వంలో పెద్ద ఎత్తున గల్ఫ్ కార్మికులను సమీకరించనున్నట్లు తెలిపారు. గల్ఫ్ కార్మికులు ఎదురుచూస్తున్న గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు, సమగ్ర NRI పాలసీ కోసం నిజామాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.