ఆర్మూర్‌టౌన్, జనవరి 4 : ఆర్మూర్ బల్దియా చైర్పర్సన్ పండిత్ వినితకు షాక్ తగిలింది. అన్ని పార్టీల కౌన్సిలర్లు ఏకం కావడంతో పదవిని కోల్పోయారు. వినీతపై గత ఏడాది డిసెంబర్ నెలలో స్వపక్షంలోనే విపక్షం తయారైంది. కౌన్సిలర్లందరూ ఒక్కటై కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వినతి పత్రం అందజేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్మూర్ ఆర్డీవో వినోద్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ గురువారం నిర్వహించారు. సమావేశానికి ఎక్స్ అఫిషియో మెంబర్‌గా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి హాజరయ్యారు.
బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి సోదరుడు ప్రైవేట్ బస్సులో మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఇందులో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా, కౌన్సిలర్లు పుతిలి బేగం, ఖాందేశ్ సంగీత, ఎనుగంటి వరలక్ష్మి, బండారి ప్రసాద్, ఇట్టెడి నర్సారెడ్డి, మేడిదల సంగీత, కోనపత్రి కవిత, కోలు గంగామోహన్, సుంకరి ఈశ్వరి, అయేషా శిరీన్, వన్నెల్దేవి లావణ్య, అల్జాపూర్ రేవతి, నాజ్మిన్ సుల్తానా, బారడి రమేశ్, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన మహ్మద్ ఇంతియాజ్ హుస్సేన్, ఎంఐఎం పార్టీకి చెందిన హర్షదీ బేగం, స్వతంత్రుడైన వనం శేఖర్ ఉన్నారు. వేరే కారులో వచ్చిన ఇతర పార్టీలో చేరిన గాండ్ల లక్ష్మి వెళ్లారు. అదే విధంగా బీజేపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు పల్లెపు లత, ఆకుల సంగీత, జీవీ నరసింహా రెడ్డి కారులో వచ్చారు. మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత, ఆమె మద్దతుదారులు సమావేశానికి హాజరు కాలేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇద్దరు స్వతంత్ర కౌన్సిలర్లు, బీజేపీ కౌన్సిలర్లు మొత్తం 24 మంది.. ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డితో సహా మొత్తం 25 మంది సభ్యులు చేతులెత్తి అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారు. దీంతో అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్మూర్ ఆర్డీవో వినోద్ కుమార్, కమిషనర్ ప్రసాద్ చౌహాన్ ప్రకటించారు.
నాలుగు సంవత్సరాలుగా ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కొనసాగిన పండిత్ వినిత.. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో పదవిని కోల్పోయారు. ఆర్డీవో వినోద్ కుమార్, కమిషనర్ ప్రసాద్ చౌహాన్ అవిశ్వాస తీర్మాన వివరాలను కలెక్టర్‌కు నివేదిస్తామని.. తదుపరి ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ నూతన చైర్పర్సన్ ఎన్నికకు తేదీని ప్రకటిస్తామన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏసీపీ జగదీశ్ చందర్, ఎస్‌హెచ్‌వో సురేశ్ బాబు, ఎస్సైలు అశోక్, గంగాధర్, గోపి, యాదగిరి గౌడ్ బందోబస్తు నిర్వహించారు.
ఆర్మూర్‌టౌన్, జనవరి 4 : అవినీతిపైనే బీజేపీ పోరాటమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి అన్నారు. అవిశ్వాస తీర్మానం అనంతరం ఆయన మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఆర్మూర్ నియోజక వర్గంలో ఎక్కడా అవినీతి జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. ప్రస్తుతం బల్దియాలో సైతం అవిశ్వాసం నెగ్గిందని.. అవినీతి ఓడిందన్నారు.