Central lighting work | పెద్ద కొడప్ గల్ (పిట్లం),జులై 04: పిట్లం మండల కేంద్రంలో రెండు సంవత్సరాలుగా నిలిచిపోయిన సెంట్రల్ లైటింగ్ పనులు వెంటనే ప్రారంభించాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార అన్నారు. సెంట్రింగ్ లైట్ పనులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అరుణతార ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అరుణ తార మాట్లాడుతూ పనులు ప్రారంభించకుండా కాలయాపన చేయడం వల్ల ఒక వర్షం పడితేనే షాపులు, ఇండ్లు, ప్రభుత్వ పాఠశాలలు మురుగు నీటితో నిండి ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బిచ్కుందలో ధర్నా చేయడంతో పనులు ప్రారంభమయ్యాయని గుర్తుచేస్తూ, ఇక్కడ కూడా పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కోట్ల కొద్ది నిధులు ఉన్నాయని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు పనులు ప్రారంభించడానికి నిధులు లేవని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వారు ఎద్దేవా చేశారు.
పనులు వెంటనే ప్రారంభించకపోతే, ప్రజలతో కలిసి రోడ్లమీద కూర్చోవాల్సి వస్తుందని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ప్రజల సౌలభ్యం కోసం ఈ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిట్లం మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.