జననీ జన్మభూమిశ్చ.. స్వర్గాదపీ గరీయసీ.. పుట్టిన ఊరు స్వర్గం కన్నా గొప్పదంటూ రాశారో గొప్ప కవి. ఆ పాటను నిజం చేస్తూ ఎక్కడ ఉన్నా పండుగ రాగానే ఒక్కచోట చేరుతారు ఆ గ్రామస్తులు. ఉద్యోగ, వ్యాపార రీత్యా ఎక్కడెక్కడో ఉన్న వారంతా పిల్లాపాపలతో కలిసి తరలివస్తారు. మూడు రోజులపాటు ఒక్కచోట చేరి చిన్ననాటి జ్ఞాపకాలు నెమరేసుకుంటూ, సాయంత్రం సమయంలో వేడుకలు నిర్వహిస్తారు. అంతా ఒక్కటై కష్టసుఖాలను పంచుకుంటారు. కలిసిమెలసి ఉంటూ ఆనందంగా గడుపుతారు. ఇలా ఊరంతా కలిసి చేసే పండుగ సంక్రాంతి కాగా.. ఆ ఊరే బీర్కూర్ మండలంలోని రైతునగర్. సంక్రాంతి పండుగ సందర్భంగా రైతునగర్లో జరిగే వేడుకలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
బాన్సువాడ, జనవరి 13: సంక్రాంతి వస్తుందనగానే ఆ ఊరివారంతా ఒక్కచోటికి చేరుతారు. ఇతర దేశాలు, రాష్ర్టాలు, పట్టణాల్లో ఉన్నవారంతా ఒకే గూటికి వస్తారు. ఊరంతా కలిసి ఉమ్మడిగా వేడుకలు నిర్వహిస్తారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని రైతునగర్ గ్రామం పండుగకు పూర్వవైభవం తెస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలో ఏర్పాటు చేసుకున్న జన్మభూమి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించే సంక్రాంతి పండుగ వేడుకలు అంబరాన్నంటుతాయి. సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే వేడుకలతో ఊరంతా సందడి నెలకొంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, చదువుల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో తీరికలేని జీవితం గడుపుతారు ఇక్కడివాసులు కొందరు. మూడు రోజుల పాటు ల్యాప్టాప్, సెల్ఫోన్లను పక్కనపెట్టి పల్లెవాతావరణంలో పిల్లలతో కలిసి సంక్రాంతి సంబురాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకొంటారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే సంక్రాంతి పండుగకు చిరునామాగా రైతునగర్ గ్రామాన్ని చెప్పవచ్చు. ఎక్కడా లేని విధంగా గ్రామమంతా చిన్నాపెద్దలు, తారతమ్యం లేకుండా కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొంటారు. సంక్రాంతి పండుగ సంబురాల్లో భాగంగా గ్రామమంతా ఒకే కుటుంబంలా వేడుకలు నిర్వహించేలా గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థులు, పెద్దలు కలిసి జన్మభూమి చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టు ఆధ్వర్యంలో సంబురాలను నిర్వహిస్తారు. ఎంతో దూరంగా స్థిరపడిన వారంతా సంక్రాంతి వచ్చిందంటే పుట్టిన ఊరికి వచ్చేసి సంబురాల్లో పాల్గొంటారు. నేటి నుంచి మూడు రోజుల పాటు వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తారు.
గ్రామంలోని మూలమలుపుల వద్ద బంధువులతో కలిసి భోగి మంటలు వేస్తారు. అక్కడి నుంచి గ్రామంలో వయసు భేదం లేకుండా హరిదాసుడి ఆటలు, కుర్చీల ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు,కబడ్డీ, తాడు గుంజుడు,చిన్నారులకు కైట్ ఫెస్టివల్, మహిళలకు ముగ్గుల పోటీలు, వాలీబాల్తోపాటు డ్యాన్సు, నృత్యప్రదర్శనలను నిర్వహిస్తారు. శనివారం గ్రామంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆదివారం రోజు జన్మభూమి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సామూహిక భోజనాలు ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం వేళ ప్రతి ఏటా రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి దంపతులను ఆహ్వానించి సాంస్కృతిక కార్యక్రమాలు, బహుమతుల ప్రదానం, భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకొంటారు.
రైతునగర్ గ్రామం 75 ఏండ్ల క్రితం గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఏలూరు, ఒంగోలు తదితర గ్రామాల నుంచి వచ్చిన ఐదు కుటుంబాలతో మొదలైనట్లు చెబుతారు. వ్యవసాయం నిమిత్తం అమరనేని శివయ్య అనే వ్యక్తి మొదటగా వచ్చి గుడిసెలు వేసుకొని జీవించారని గ్రామస్తులు చెబుతారు. అనంతరం వ్యవసాయంలో ఆదర్శంగా నిలువడంతో గ్రామానికి రైతునగర్గా పేరు వచ్చిందని, అప్పట్లో రంగనాయకులు గ్రామాన్ని ఏర్పాటు చేసినట్లు గ్రామస్తులు చెబుతుంటారు.
గ్రామంలో కరెంటు, రోడ్ల విస్తరణ తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అప్పట్లోనే గ్రామంలో విశాలమైన రోడ్లు ఏర్పాటు చేయడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రైతునగర్ నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సహకారం, సర్పంచ్ నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో రైతునగర్ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. నాటి నుంచి నేటి వరకు రైతునగర్ను స్పీకర్ పోచారం తన స్వగ్రామంగా భావిస్తారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఫంక్షన్ హాల్, నూతన గ్రామ పంచాయతీ, రైతువేదిక తదితర అన్ని ప్రభుత్వ పథకాలు అమలు చేయడంతో అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తున్నది.
సంక్రాంతి పండుగను రైతునగర్ గ్రామస్తులు మూడు రోజులపాటు నిర్వహిస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు పచ్చని తోరణాలు, ముంగిట ముగ్గులు, రోడ్ల వెంట లైటింగ్, చిన్నారుల నృత్యాలు, పెద్దలకు క్రీడాపోటీలు, వృద్ధుల రచ్చబండ ముచ్చట్లు ఇలా గ్రామమంతా సందడి వాతావరణం నెలకొంటుంది.
ప్రతి సంవత్సరం పండుగకు సొంతూర్(రైతునగర్)కు కుటుంబసమేతంగా వస్తాం. వైభవంగా గ్రామస్తులమందరం కలిసి పండుగను మూడు రోజులపాటు నిర్వహిస్తాం. బిజీగా ఉండే ప్రతి ఒక్కరూ గ్రామానికి రావడంతో అందరం కలిసి మాట్లాడుకుంటాం. చిన్ననాడు ఆడిన ఆటలు , జ్ఞాపకాలు నెమరేసుకుంటాం. అసలు మూడు రోజులు ఎలా గడుస్తుందో తెలియదు. ఊరూవాడా అంతా పచ్చనితోరణాలు, రంగుల లైట్ల కాంతులు ఎక్కడ చూసినా పండుగే. మర్చిపోలేని అనుభూతి ఉంటుంది.
– మహేశ్(ఎస్సై గండిపేట్), హైదరాబాద్
వృత్తిరీత్యా, ఉద్యోగ, వ్యాపారంలో భాగంగా హైదరాబాద్, బెంగళూర్ తదితర పట్టణాల్లో ఎక్కడ ఉన్నా సంక్రాంతి పండుగ నాటికి రైతునగర్ చేరుకుంటారు. గ్రామస్తులమంతా ఒక్కచోట చేరి ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకొంటాం. ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున స్పీకర్ పోచారం మా గ్రామానికి వస్తారు. మాతోపాటు వేడుకల్లో పాల్గొంటారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి బహుమతులు అందజేస్తారు.
– మద్దినేని నాగేశ్వర్రావు, సర్పంచ్, రైతునగర్
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. ఎన్నో రోజులుగా కలుసుకోని వాళ్లు కూడా గ్రామానికి వస్తుంటారు. ప్రతి ఒక్కరి బాగోగులు తెలుసుకుంటాం. గ్రామంలో ఒకచోట జన్మభూమి చారిటబుల్ ట్రస్టు ద్వారా వేడుకలను నిర్వహిస్తాం. కలిసికట్టుగా ఉంటాం. గ్రామంలో మూడు రోజుల పాటు వేడుకలు చూసేందుకు రెండుకండ్లు సరిపోవు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా జరగని విధంగా రైతునగర్లో పండుగ సంబురాలు నిర్వహిస్తాం.
– కొమ్మినేని రాజేశ్, రైతునగర్