Allu Arjun | కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో గత నెల 28న జరిగిన బాణసంచా తయారీ కేంద్రం అగ్నిప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో తన తండ్రిని కోల్పోయి అనాథగా మిగిలిన మానసిక దివ్యాంగురాలు కడింపల్లి దుర్గ దీనస్థితి సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ హృదయ విదారక గాథపై స్పందించిన టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, ఆమెకు అండగా ఉంటానని మాట ఇచ్చారు.
దుర్గ పోషణ కోసం తన వంతు సహాయంగా జీవితాంతం ప్రతి నెలా రూ. 7,500 ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు అల్లు అర్జున్ ప్రకటించారు. బన్నీ వాసు పర్యవేక్షణలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు నేరుగా దుర్గ నివాసానికి వెళ్లి, ఆమె కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తక్షణ ఆర్ధిక సహాయం అందించడంతో పాటు, భవిష్యత్తులోనూ ఆమెకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ఆపదలో ఉన్న ఒక దివ్యాంగురాలికి అండగా నిలిచి అల్లు అర్జున్ తన గొప్ప మనసును చాటుకోవడంతో అభిమానులు మరియు స్థానికులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.