వినాయక్ నగర్, ఫిబ్రవరి 18: నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్ఐని దుండగలు కారుతో ఢీ కొట్టారు. నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఉదయ్ కుమార్.. సోమవారం రాత్రి కోట గల్లి ఏరియాలో తన సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన ఓ కారును తనిఖీ చేసేందుకు ఆపారు. అయితే డ్రైవర్ వారిని పట్టించుకోకుండా కారును మరింత వేగం పెంచి ఎస్ఐ ఉదయ్ కుమార్ను ఢీ కొట్టారు. అనంతరం అక్కడ నుండి పారిపోయారు. కారును పట్టుకునేందుకు సిబ్బంది ప్రయత్నించినప్పటికీ వారు దొరకకుండా వెల్లిపోయారు.
తీవ్రంగా గాయపడిన ఉదయ్ కుమార్ను హుటాహుటిన నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. తల, శరీరంలోని ఇతర భాగాలకు తీవ్రంగా గాయాలయ్యాయని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.