నవీపేట, జూన్ 17: కూతుళ్లను లైంగికంగా వేధించడంతోనే తండ్రి పల్లెపు నర్సయ్య హత్యకు గురైనట్లు నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. నవీపేట మండలం ధర్మారం గ్రామంలో సోమవారం కూతురి చేతిలో నర్సయ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. హత్యకు సంబంధించిన వివరాలను జిల్లా కేంద్రంలోని సీఐ కార్యాలయంలో నవీపేట ఎస్సై వినయ్‌తో కలిసి వెల్లడించారు.
ధర్మారం గ్రామానికి చెందిన పల్లెపు నర్సయ్య-నర్సవ్వ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు గంగామణి భర్త మృతి చెందగా పుట్టింటి వద్దే ఉంటుంది. చిన్న కూతురు మక్కల వర్షితను నిజామాబాద్ రూరల్ మండలం కొత్తపేటకు చెందిన శేఖర్‌తో పెండ్లి చేశారు. ఇంట్లో ఉంటున్న పెద్ద కూతురు గంగామణితో తండ్రి నర్సయ్య అసభ్యకరంగా ప్రవర్తిస్తుండడంతో వారం రోజుల క్రితం ఆమె నిజామాబాద్‌కు వెళ్లి అద్దె ఇంట్లో ఉంటున్నది. ఇటీవల నర్సయ్య రెండో పెండ్లి చేసుకోవడంతో తరుచూ ఇంట్లో గొడవలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో భార్య నర్సవ్వ పెద్ద కూతురు గంగామణి వద్దకు వెళ్లి ఉంటున్నది.
ఈ విషయం తెలుసుకున్న చిన్న కూతురు వర్షిత ఈ నెల 16న తండ్రి వద్దకు వచ్చింది. తాగిన మైకంలో నర్సయ్య తన చిన్న కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక కోరిక తీర్చాలంటూ వేధించాడు. కోపోద్రిక్తురాలైన కూతురు ఇంట్లో ఉన్న రోకలి దుడ్డుతో తలపై రెండు సార్లు బలంగా బాదడంతో నర్సయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. తన తండ్రి తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతోనే చంపినట్లు కూతురు అంగీకరించినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. మృతుడి తమ్ముడు కుమారుడు పల్లపు గంగారాం ఫిర్యాదు మేరకు వర్షితను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీనివాస్, ఎస్సై వినయ్ పేర్కొన్నారు.