కోటగిరి, ఏప్రిల్ 7: ప్రతి పల్లెకూ బస్సు సౌకర్యం ప్రకటనలకే పరిమితమైంది. రోడ్లు, ఇతర మౌలిక వసతులు మెరుగు పడినా ఇప్పటికీ చాలా ప్రాంతాలకు బస్సులు రావడం లేదు. ఆర్టీసీ సేవలు అందక జనం సతమతమవుతున్నారు. ‘పల్లె వెలుగు’లు రాక తండాలు తల్లడిల్లుతున్నాయి. గిరిజన గూడేలు ఇంకా కాలినడకనే ప్రయాణాలు కొనసాగిస్తున్నాయి. విద్యార్థులు చదువుకోవాలంటే నడవాల్సిందే. వేరే ప్రాంతాలకు వెళ్లాలనుకునే తండా వాసులు కాలినడకను నమ్ముకోవాల్సిందే.
కోటగిరి మండలంలోని పలు తండాలకు బస్సు సౌకర్యం లేదు. ఆయా గ్రామాలకు బీటీ రోడ్డు సౌకర్యం ఉన్నా కూడా పల్లెలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, గ్రామస్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కోటగిరి మండలం సుద్దులం తండాకు పల్లె వెలుగు బస్సు సౌకర్యం లేదు. దీంతో నిత్యం 20 మంది విద్యార్థులు పొద్దున, సాయంత్రం సుద్దులం తండా నుంచి సుద్దులం వరకు నడుచుకుంటూ వెళ్లాల్సిందేనని వాపోతున్నారు. ఊరికి పోవాలంటే నడుచుకుంటూ వెళ్లాల్సిందేనని హరిలాల్ తండా, సుద్దులం తండా, నాచుపల్లి తండా,రాంపూర్ తండా గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తండా వరకు బీటీ రోడ్డు సౌకర్యం ఉన్నా ఏడాది నుంచి బస్సు వస్తలేదని, ఈ విషయమై పలుమార్లు విన్నవించినా సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు. .
ప్రజల అవసరాలను గుర్తించి బస్సులు నడిపిస్తున్నాం. గతంలో ఏయే రూట్లలో నడుస్తున్నాయో వాటిని యథావిధిగా తిప్పుతున్నాం. అదనపు ట్రిప్పులు కావాలని వినతులు వస్తున్నాయి. సర్వే ఆధారంగా పెంచేందుకు ప్రయత్నిస్తాం. ఏదైనా గ్రామాలకు బస్సు సౌకర్యం కావాలని మా దృష్టికి తీసుకోస్తే కచ్చితంగా వాటిని పరిశీలిస్తాం.
– విశ్వనాథ్, ఆర్టీసీ డిపో మేనేజర్, బోధన్
కోటగిరి నుంచి సుద్దులం తండా వరకూ బీటీ రోడ్డు ఉన్నా కూడా బస్సు వస్తలేదు. ఇంతకు ముందు మా సుద్దులం తండా వరకు బస్సు సౌకర్యం ఉండే. అప్పుడు మాకు మంచి సౌలత్ ఉండే. కానీ కొన్ని నెలల నుంచి మా తండాకు బస్సు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. సుద్దులం తండా, నాచుపల్లి తండా, హరిలాల్ తండా, నాచుపల్లి తండా ఇలా మూడు నాలుగు తండాల నుంచి ప్రజలు, విద్యార్థులు కోటగిరికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సుద్దులం తండా వరకు బస్సు సౌకర్యం కల్పించాలి.
-విఠల్ నాయక్, సుద్దులం తండా, కోటగిరి మండలం