బాల్కొండ, సెప్టెంబర్ 14: బాల్కొండ ఖిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలుడ్ని దారుణంగా హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఏసీపీ బస్వారెడ్డి శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. బాల్కొండ మండలం చిట్టాపూర్‌కు చెందిన కచ్చు మల్లేశ్, భాను దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మల్లేశ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, భాను పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నది. ఇద్దరు కుమారులలో చిన్నవాడైన రాకేశ్ (12)ను హాస్టల్లో వేయగా, అక్కడ ఉండలేనని ఇంటికి తిరిగి వచ్చేశాడు.
భాను కుటుంబానికి పరిచయమున్న బాల్కొండకు చెందిన బండి నరేందర్ గత బుధవారం వారి ఇంటికి వచ్చాడు. గణపతులను చూద్దామని చెప్పి రాత్రివేళ రాకేశ్‌ను బైక్‌పై తీసుకెళ్లాడు. ఆ తర్వాత నుంచి బాలుడి ఆచూకీ లేకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు నరేందర్‌ను ప్రశ్నించగా తనకు తెలియదని చెప్పాడు. బాలుడి తల్లి బాల్కొండ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మూడు రోజుల నుంచి వెతుకుండగా, శనివారం బాల్కొండ ఖిల్లాలో బాలుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించిన పోలీసులు.. నరేందర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రాకేశ్ విగత జీవిగా పడి ఉండడాన్ని చూసి కన్న తల్లితో పాటు బంధువులు గుండెలు బాదుకున్నారు. మరోవైపు, రాకేశ్‌ను చంపిన నరేందర్‌ను తమకు అప్పగించాలని బాధితులు పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అప్పటివరకు మృతదేహాన్ని తరలించేది లేదని పట్టుబట్టారు. నిందితుడ్ని అరెస్టు చేసి, న్యాయం చేస్తామని ఏసీపీ హామీ ఇవ్వడంతో చివరకు ఆందోళన విరమించారు.
మరోవైపు, బాలుడి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాకేశ్ అదృశ్యమైన రోజు అష్టమి కావడం, మృతదేహంపై ఎలాంటి దుస్తులు లేకపోవడం, కేవలం తలపై మాత్రమే గాయాలు ఉండడంతో క్షుద్రపూజలు చేసి హతమార్చారా? అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. మరోవైపు, నరేందర్‌ది నేరపూరిత స్వభావమని, గతంలో నగల కోసం కన్నతల్లిపై దాడి చేసి జైలుకు వెళ్లొచ్చాడని గ్రామస్తులు చెబుతున్నారు.