కామారెడ్డి, డిసెంబర్ 3 : కామారెడ్డి జిలా ్లకేంద్రంలో బీఆర్ఎస్వీ ప్రతినిధులు మంగళవారం గురుకుల బాట పట్టారు. కామారెడ్డి జిల్లా ఇన్చార్జి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్, బీఆర్ఎస్ యూత్ టౌన్ ప్రెసిడెంట్ చెలిమల భాను ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలోని ట్రైబల్ డిగ్రీ కళాశాల, మైనార్టీ జూనియర్ కళాశాలను సందర్శించారు. కళాశాలలో నెలకొన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణ శివారులోని సరంపల్లిలో ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలకు వెళ్లడానికి యత్నించగా..ప్రిన్సిపాల్ అనుమతించలేదు.
పోలీసులను రప్పించి బీఆర్ఎస్వీ నాయకులను బలవంతంగా స్కూల్ బయటికి పంపించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ.. నిరంకుశంగా వ్యవహరిస్తున్న రేవంత్ సర్కార్ గురుకులాల విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. విద్యార్థి సమస్యలపై పోరాడుతున్న బీఆర్ఎస్వీ నాయకులపై దౌర్జన్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు గురుకులాల్లో 50 మందికిపైగా విద్యార్థులు చనిపోయినా పట్టించుకోవడంలేదన్నారు.
విద్యారంగంపై కనీసం సమీక్ష చేయకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ కూడా పతనం కాకతప్పదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు మారుతి, శీను, సాయి, బుల్లెట్ సాయి, పరుశురామ్ గౌడ్, సాయి కృష్ణ, వినయ్ తదితరులు పాల్గొన్నారు.