బీఆర్ఎస్ రజతోత్సవ వేళ పార్టీలో సరికొత్త జోష్ నెలకొన్నది. కొంతకాలంగా పార్టీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇతరపార్టీల నేతలు గులాబీ కండువా కప్పుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో ఇతర పార్టీల నుంచి నాయకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరారు. అంతకుముందు కామారెడ్డిలో మాజీ ప్రభుత్వ విప్ సారథ్యంలో బీఆర్ఎస్లో పలువురు చేరారు. అర్బన్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సమక్షంలో మైనార్టీ నాయకులు గులాబీ కండువా కప్పుకున్నారు.
ఇటీవల బాన్సువాడలో ఎమ్మెల్సీ కవిత సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరగా.. బాల్కొండ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచులు, ఎమ్మెల్యే వేముల సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ పురుడు పోసుకుని 25 వసంతాలు కాగా, ఏప్రిల్ 27న ఆవిర్భావ దినోత్సవానికి వరంగల్ జిల్లాలో ఘనంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రజతోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్న వేళ.. కాంగ్రెస్, బీజేపీ నుంచి నాయకులు చేరుతుండడంపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
-నిజామాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ పాలనతీరు తేటతెల్లమైంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అడుగడుగునా మోసాలే తప్ప, ప్రజలకు చేసిందేమీ లేదు. ఇచ్చిన హామీల చిట్టాను అటకెక్కించింది. హామీల అమలులో కనీస శ్రద్ధను కనబర్చడం లేదు. హామీలు అమలుచేయాలని ప్రశ్నించేవారిపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఎన్నికల సమయంలో లేనిపోని హామీలతో నిరుద్యోగ యువతను ఆకట్టుకున్నారు. వారి వెంట తిప్పించుకుని ఇష్టారీతిన ప్రకటనలు చేశారు.
ఏడాదిన్నర కాలంలో జాబ్ క్యాలండర్‌ను అమలు చేయలేదు. జాబ్ క్యాలండర్ విధి విధానాలను విడుదల చేసినప్పటికీ అమలుకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ మినహా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్‌ను జారీ చేయలేదు. కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి, దరఖాస్తులు స్వీకరించి, పరీక్షలు రాసిన తర్వాత వాటి ఫలితాలను అనివార్యంగా విడుదల చేసి వారికి నియామక పత్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందించింది.
ఈ నియామకాలు అన్నింటినీ తమ గొప్పతనంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు. కానీ కొత్త నోటిఫికేషన్లపై నోరు విప్పడం లేదు. కాంగ్రెస్ తీరుతో విసిగి వేసారిపోతున్న యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారంతా తిరిగి కేసీఆర్ ప్రభుత్వమే రావాలంటూ కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ పాలనే బాగుందంటూ ఒక్కటై నినదిస్తున్నారు. వారంతా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. కేసీఆర్‌కు జై కొట్టేందుకు సిద్ధమయ్యారు. గులాబీ జెండానే తెలంగాణకు రక్షణ అని ఎలుగెత్తి చాటుతున్నారు.
గులాబీ పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇతర పార్టీల నుంచి కాకుండా తటస్థ వ్యక్తులు సైతం బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి వేముల సమక్షంలో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే బిగాల గణే శ్ గుప్తా ఆధ్వర్యంలో మైనార్టీ యువకులు పెద్ద ఎత్తున గులాబీ కండువాలు కప్పుకున్నారు. మరోవైపు ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి భారీగా బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగాయి.
ప్రస్తుతం బీజేపీ ఎంపీఅర్వింద్ తీరు నచ్చక చాలా మంది పార్టీ వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరంతా బీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వలసల జోరుతో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతలంతా బేజారవుతున్నారు. అధికార పార్టీలను వీడి ప్రతిపక్ష పార్టీలోకి చేరికలు కొనసాగుతుండడంతో కంగు తింటున్నారు.
బీఆర్ఎస్ చేరికల జోరును పరిశీలిస్తున్న కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నాయక త్వం ఈ మధ్యే ఇరు పార్టీలకు చెందిన జిల్లా స్థాయి నేతలకు క్లాస్ పీకినట్లు తెలిసింది. స్థానిక ఎన్నికలకు సమయం ఆసన్నమైన వేళ.. బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగడంపై ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మొత్తానికి బీఆర్ఎస్లో చేరికల పర్వం ఒక్కసారిగా జాతీయ పార్టీలకు ముచ్చెమటలను తెప్పిస్తున్నది. గులాబీ పార్టీలో నయా జోష్‌ను నింపుతున్నది. రజతోత్సవ సంబురాన్ని నిర్వహించుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఉత్తేజాన్ని అందిస్తున్నది.