ఖలీల్‌వాడి, ఆగస్టు 3: జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ చేపట్టింది జనహిత పాదయాత్ర కాదని, అది జన రహిత పాదయాత్ర అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జనం లేక మీనాక్షీ పర్యటన వెలవెలబోతున్నదని తెలిపారు. ఆమె పాదయాత్రకు ప్రజాస్పందన కరువవడంతో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారని, జన సమీకరణ కోసం తన డబ్బులు పంపానని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్చార్జి వినయ్‌రెడ్డిపై కేకలేసిన పీసీసీ చీఫ్ తాను పంపిన డబ్బు లు పంపిణీ చేయలేదా అని రుసరుసలాడారని, మైక్‌లో పీసీసీ అధ్యక్షుడి మాటలు విని అంతా షాకయ్యారని చెప్పారు.
సిద్ధుల గుట్ట శివన్న సాక్షిగా చెప్పాలి..
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్ని హామీలను అమలు చేసిందో ఆర్మూర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న మీనాక్షి నటరాజన్ సిద్ధ్దులగుట్ట శివన్న సాక్షిగా నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె తెలంగాణలో ఒక రాజ్యాంగేతర శక్తిగా మారారని విమర్శించారు. గాంధీ ఫ్యామిలీ సాగిస్తున్న బానిసత్వ రాజకీయానికి తెలంగాణను ప్రయోగశాలగా మార్చుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని నీతులు వల్లించే రాహుల్‌గాంధీ తెలంగాణలో మాత్రం రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారని విమర్శించారు.
రేవంత్‌ను డమ్మీ సీఎంను చేసి తెలంగాణలో తిప్పుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే 50 సార్లు ఢిల్లీ వెళ్లి గాంధీ ఫ్యామిలీకి భజన చేస్తూ తెలంగాణ కోసం ఇంత బూందీ కూడా తేలేకపోయిన రేవంత్‌రెడ్డికి రాహుల్‌గాంధీ దర్శనం కూడా కావడంలేదన్నారు.
మీనాక్షి పాదయాత్ర చేస్తూ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారో తెలియడం లేదన్నారు.
మాటల్లో గాంధేయవాదం, చేతల్లో గాడ్సే వాదమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాలతో ఆర్మూర్ రైతులపై పోలీసుల దాష్టీకాలు కొనసాగాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ప్రజాపాలన అంటారా ? లేక ప్రతీకార పాలన అంటారా ? అని ప్రశ్నించారు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదని, అవినీతి భోజ్యమని, ఇది ఎమర్జెన్సీ పాలన కాక మరేమిటీ ? అని ఆయన దుయ్యబట్టారు. తప్పుడు మాటలు నమ్మి కాంగ్రెస్‌కు ఓట్లేసిన ప్రజలను రేవంత్ సర్కారు వెన్నుపోటు పొడిచింది నిజం కాదా ? అని నిలదీశారు.
పీసీసీ చీఫ్ రోత మాటలు మానుకోవాలి
టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ రోత మాటలు మానుకోవాలని జీవన్‌రెడ్డి హితవు పలికారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనపై పచ్చి అబద్ధాలు చెబుతూ కేసీఆర్, కేటీఆర్‌పై విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహేశ్‌కుమార్‌గౌడ్‌కు నీళ్లపై అవగాహన లేదన్నారు. విషయం లేక గాలినంత పోగేసి కామెడీ షో చేస్తుండని ధ్వజమెత్తారు. అమాత్యులంతా అవినీతి ఆనకొండలేనని, ఆమ్యామ్యాలు లేనిదే ఫైళ్లు కదలవని ఆరోపించారు. ప్రతి మంత్రి పేషీలో ఇదే తంతు అని, సచివాలయమంతా అవినీతి కంపు కొడుతున్నదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వమంటేనే కమీషన్ల పాలననని మంత్రి కొండా సురేఖ ఆ మధ్య ప్రభుత్వంలో అంతు లేని అవినీతి ఉందని సర్టిఫికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. పీసీసీ చీఫ్ కొత్తగా నీతులు చెబితే నమ్మేదెవరని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.