సారంగాపూర్, ఏప్రిల్ 5: అబద్ధాలు, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ..సొల్లు కబుర్లు మాని ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. ప్రజలు, రైతుల సంక్షేమాన్ని రేవంత్‌రెడ్డి సర్కార్ పూర్తిగా విస్మరించి, కక్ష రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో అర్బన్, రూరల్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి శుక్రవారం ఉదయం వాకర్లతో సమావేశమయ్యారు. ఆప్యాయంగా పలుకరించి తనను ఆశీర్వదించాలని కోరారు.
అనంతరం బాజిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల కష్టాలను తీర్చాల్సిన బాధ్యతను మరిచి సీఎంతోపాటు మంత్రులు సోయి లేకుండా స్కాంలు జరిగాయంటూ నిరాధారమైన ఆరోపణలతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి పచ్చి అబద్ధాల కోరు అని, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఉన్న ఆయన పార్లమెంట్ పరిధిలో ఉన్న నిజామాబాద్ జిల్లాను ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. మళ్లీ ఎంపీ అభ్యర్థిగా ఓట్లు ఏ ముఖం పెట్టుకుని అడుగుతాడని ప్రశ్నించారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఇప్పటికే విసుగు చెంది ఉన్నారని, ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
అబద్ధాల అర్వింద్ ఎంపీగా ఉండి జిల్లాకు ఆయన చేసింది శూన్యమన్నారు. ఆయనపై ఏడు సెగ్మెంట్ల ప్రజలు గుర్రుగా ఉన్నారన్నారు. ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి పసుపు రైతులను మోసం చేశాడని మండిపడ్డారు. అప్పుడేమో బాండ్ పేపర్ చూపించి ఓట్లు దండుకున్న అర్వింద్ మళ్లీ ఇప్పుడు ఇటీవల ఏదో జీవో కాపీ తీసుకువచ్చి ఎంపీగా గెలిపించాలని ఓట్లు అడగడం ఎంతవరకు సమంజసమన్నారు. అప్పుడు, ఇప్పుడు పేపర్లు చూపిస్తూ ఓట్లు అడిగే అర్వింద్‌ను ప్రజలు, రైతులు ప్రస్తుతం నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. అర్వింద్‌ను ఆపార్టీ క్యాడర్‌తో పాటు ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారన్నారు. షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పేవన్నీ ఉత్తుత్తి మాటలేనని పేర్కొన్నారు. పసుపు బోర్డు కోసం నాడు అప్పటి ఎంపీ కవిత ఎంతో కృషిచేశారని గుర్తుచేశారు.
తనకు ఒక్కసారి ఎంపీగా అవకాశమివ్వాలని, తమ పార్టీ అధికారంలో లేకున్నా అపోజిషన్‌లో ఉండైనా కొట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బాజిరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ సింగిల్ లైన్ రైల్వేట్రాక్‌ను డబ్లింగ్ చేసేందుకు కృషి చేస్తానన్నారు. దశాబ్దాల కల అయిన బోధన్ నుంచి బీదర్ వరకు రైల్వేలైన్ ఏర్పాటు చేసేందుకు పాటుపడుతానన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వేలాది మంది యువకులు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళుతున్నందున వారి సంక్షేమం కోసం తాను ప్రత్యేక చొరవ చూపుతానన్నారు. బాజిరెడ్డి వెంట నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సుజిత్‌సింగ్ ఠాకూర్, ఎనుగందుల మురళి, దాసరి లక్ష్మీనర్సయ్య, ఉమాపతిరావు, కొర్వ దేవేందర్, శ్రీనివాస్‌రావు తదితరులున్నారు.