ఖలీల్‌వాడి, నవంబర్ 29: రాష్ట్రంలో మళ్లీ రాజ్యాధికారం బీఆర్ఎస్ పార్టీదేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, దీక్షాదివస్ ఇన్చార్జి ఫారూఖ్ హుస్సేన్ అన్నారు. ఏడాది కాలంలో ఏం కోల్పోయామో ప్రజలకు తెలిసొచ్చిందని, కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ను లేకుండా చేయడం ఎవరి తరమూ కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ మొండి మనిషి అని, ఆయనతోనే దశాబ్దాల తెలంగాణ కల సాకారమైందని చెప్పారు.
కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టి 15 ఏండ్లు పూర్తయిన నేపథ్యంలో కేటీఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం దీక్షాదివస్ కార్యక్రమం నిర్వహించారు. ఇన్చార్జి ఫారూఖ్ హుస్సేన్, మాజీ మంత్రి వేముల, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్తా, బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి ఆయేషా ఫాతిమా, జడ్పీ మాజీ చైర్మన్ విఠల్‌రావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వినాయక్‌నగర్‌లోని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు.
బీఆర్ఎస్ కార్యాలయంలో యువ నాయకుడు అభిలాష్‌రెడ్డి ఆధ్వర్యంలో 110 మంది రక్తదానం చేశారు. కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ.. దేశంలోని నేతలందరినీ ఏకం చేసిన ఘనత కేసీఆర్‌దేనని తెలిపారు. తెలంగాణ రాకుండా కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్నారని, కేసీఆర్ అవిశ్రాంత పోరాటంతో తెలంగాణ ఇవ్వక తప్పలేదన్నారు. ఎంతో మంది నేతలు అమ్ముడుపోయారని, కేసీఆర్ మాత్రం ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించారని చెప్పారు. కేసీఆర్ చెప్పాడంటే దానిపై నిలబడతారని, ఎన్ని శక్తులు అడ్డువచ్చినా పోరాటం మాత్రం ఆపలేదన్నారు. తన ప్రాణం పోయినా సరే తెలంగాణ రావాలని కోరుకున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని ప్రశంసించారు.
దీక్షాదివస్ కార్యక్రమంలో వేముల మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ ఆమరణ దీక్షకు సిద్ధమైన రోజున ఆయన ఇంట్లో ఉన్న పరిస్థితులను వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో నిరాహార దీక్షకు సిద్ధం కాగా, ఆయన సోదరీమణులు బాధపడుతున్న తీరుని వివరిస్తూ వేముల భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ నేతలు ఎస్కే అలీమ్, ప్రభాకర్‌రెడ్డి, రాంకిషన్‌రావు, సిర్ప రాజు, సత్యప్రకాశ్, రవిచంద్ర, తెలంగాణ శంకర్, సూదం రవిచందర్, బాజిరెడ్డి జగన్, రాజారాం యాదవ్, ఇమ్రాన్, సుమనారెడ్డి, మంజుల యాదవ్, విశాలినీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పని అయిపోయిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తలకెక్కి మాట్లాడుతుండు. బీఆర్ఎస్ పార్టీని వచ్చే ఎన్నికల్లోపు లేకుండా చేయడం నీ తాత తరం, నీ బుడ్డర్ఖాన్ సీఎం తరం కూడా కాదు. సైనికుల్లా నిఖార్సయిన కార్యకర్తలు కేవలం టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్‌కు మాత్రమే ఉన్నారు. అధికారంలో లేకపోయినా ఒక్క పిలుపుతో స్వచ్ఛందంగా వేల మంది కార్యకర్తలు దీక్షాదివాస్కు రావడం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల క్రమశిక్షణ. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజల చేత ఇన్ని తిట్లు తిని ఉండడు. రేవంత్‌రెడ్డికి రోజులు దగ్గర పడడానికి మా కార్యకర్తలే నిదర్శనం. పది రోజుల ముందే దీక్షాదివస్ కార్యక్రమాన్ని ముందే ప్రకటించినప్పటికీ పోటీగా జిల్లాల్లో మంత్రుల పర్యటనలు పెట్టి రేవంత్‌రెడ్డి చిల్లర వేషాలు వేస్తుండు.
2001 ఒక్కడిగా తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన కేసీఆర్ వెంట కోట్లాది మంది ప్రజలు నడిచారు. ఒక ప్రాంతం కోసం, ప్రజల కోసం కేంద్ర మంత్రి పదవికి దేశంలోనే ఎవరూ రాజీనామా చేయలేదు. తెలంగాణ ఇవ్వనందుకు చివరి అస్త్రంగా నవంబర్ 29 ఆమరణ దీక్ష చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. పోలీసు నిర్బంధంతో దీక్షను ఆపేందుకు, కేసీఆర్‌ను చంపేందుకు కుట్రలు జరిగాయి. రోజురోజుకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండడంతో ఉద్యమం మరింత చెలరేగింది.
భయపడిన కాంగ్రెస్ అధిష్టానం తప్పని పరిస్థితుల్లో డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రకటించింది. దీనికంతటికీ మూలమే నవంబర్ 29న కేసీఆర్ మొదలుపెట్టిన దీక్ష. అందుకు గుర్తుగానే దీక్షాదివస్ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఎట్లా అయితే సీమాంధ్ర చేతుల్లో బందీ అయిన తెలంగాణను విముక్తి చేయాలని కేసీఆర్ 29 నాడు దీక్ష చేశారో, ఇప్పుడు మనమందరం సీఎం రేవంత్‌రెడ్డి చేతిలో బందీ అయిన తెలంగాణను విడిపించడానికి పోరాడాల్సిన అవసరం ఏర్పడింది. దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా కేసీఆర్ తీర్చిదిద్దితే, రేవంత్‌రెడ్డి ఏడాది కాలంలో సర్వనాశనం చేశారు.
రైతు భరోసా లేదు. పెన్షన్ సరిగ్గా రావడం లేదు. రుణమాఫీ కాలేదు. ధాన్యం సరిగా కొంటలేరు. తెలంగాణను తలకిందులు చేశారు. 2027లో జమిలీ ఎలక్షన్లు వస్తున్నాయి. కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. గతంలో ఏమైనా పొరపాట్లు జరిగితే అన్ని సరిదిద్దుకుందాం. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలి. ప్రజలు మనకు అండగా ఉన్నారు. మదమెక్కి మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుల భరతం పట్టాలి. మేము ముందుంటాం. మాకు సహకరించండి పోలీసు కేసులు ఈనాడు కొత్తవి కావు. ఉద్యమకాలంలో అనేక కేసులు ఎదుర్కొన్నాం. ఏ కార్యకర్తకు కష్టమచ్చిన పార్టీ మొత్తం మీకు అండగా ఉంటుంది.
– వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి
ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ చెట్టు తల్లి వేరు లాంటి వారు. ఎవడో వచ్చి పీకేయడానికి కేసీఆర్ మొక్క కాదు. వటవృక్షం. కేసీఆర్‌ను ఏదో చేస్తామని శపథాలు చేసిన వైఎస్, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి వారే జెండాలు పీక్కొని పోయారు. బుడ్డర్ఖాన్ రేవంత్‌రెడ్డి ఏం చేస్తాడు? తెలంగాణ చరిత్రలో కేసీఆర్‌ది ఎప్పటికీ చెరిపేయలేని సంతకం. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరి వల్ల కాదు. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో నవంబర్ 29, 2009న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. ఇది స్వరాష్ట్ర కల సాకారానికి పునాది పడిన రోజు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను, 36 పార్టీలను ఒప్పించి, మెప్పించి రాష్ట్రం సాధించిన గొప్ప ఉద్యమనేత కేసీఆర్. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తెలంగాణకు మళ్లీ అదే అంధకారం వచ్చింది.
చిట్టినాయుడి అరాచక పాలనలో అన్నివర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ ఒక్క హామీనీ అమలు చేయడం లేదు. కేసీఆర్ పదేండ్ల పాలనలో సంక్షేమ తెలంగాణ. కాంగ్రెస్ ఏడాది పాలనలో సంక్షోభ తెలంగాణ. అబద్ధాల హామీలిచ్చి కాంగ్రెస్‌కు ఓట్లేయాలని దండం పెట్టి, ఇప్పుడు అమలు చేయలేక ఆ హామీలకు పిండం పెడుతున్నారు. కేసీఆర్ ఇచ్చిన 24 గంటల వెలుగులు పోయి మళ్లీ చీకట్ల తెలంగాణ వచ్చింది. రైతుబంధుకు రాంరాం పలికిండు. రెండు లక్షల రుణమాఫీ పేరుతో రైతులకు టోపీ పెట్టిండు. పెన్షన్లు మాయమైనయ్. కొడంగల్ ప్రజలే రేవంత్‌రెడ్డిపై తిరగబడుతుండ్రు. గురుకులాల్లో పురుగుల భోజనంతో ఇప్పటికే 48 మంది పిల్లలు మృతి చెందారు.
ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తూ పల్లెప్రజలు రణభేరీ మోగిస్తున్నారు. ఇండ్లు కూలగొట్టొద్దని హైడ్రా బాధితులు హాహాకారాలు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి మోసం చేయని వారు ఎవరైనా ఉన్నారా? ఆయనను తిట్టని వారెవరైనా ఉన్నారా? నమ్మి ఓటేసినందుకు అందరినీ నట్టేట ముంచినవు. బీఆర్ఎస్ది, కేసీఆర్‌ది పైటర్స్ ఫ్యామిలీ. రేవంత్‌ది చీటర్స్ ఫ్యామిలీ. కాంగ్రెస్‌ది అవినీతి ఫ్యామిలీ. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించి ఉండకపోతే రేవంత్ సీఎం కాదు కదా, చెప్రాసీ కూడా అయి ఉండేవాడు కాదు.
ఇక్కడి బుడ్డర్ఖాన్ పీసీసీ అధ్యక్షుడూ కాలేడు. బీఆర్ఎస్ది 60 లక్షల సైన్యం. మా కార్యకర్తలు వ్యక్తులు కాదు మహాశక్తులు. పోలీసు కేసులకు భయపడం, కాంగ్రెస్‌కు ఊడిగం చేస్తున్న పోలీసు అధికారుల పేర్లు పింక్ బుక్‌లో రాస్తున్నాం. వచ్చేది మళ్లీ గులాబీ రాజ్యమే. ఎవరినీ వదిలి పెట్టేది లేదు. దీక్షాదివస్ స్ఫూర్తి నేటి ప్రజావ్యతిరేక కాంగ్రెస్‌ను బొందపెట్టే బ్రహ్మాస్త్రం. నిజామాబాద్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా. కేసీఆర్‌కు మళ్లీ కొండంత అండగా నిలిచేది ఈ జిల్లానే. కాంగ్రెస్ సర్కారును బొందపెట్టడానికి అన్నివర్గాలు కదం తొక్కాలి.
– జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
ఆనాడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం చేశాం. కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని ధర్నాచౌక్‌లో వంటావార్పు, నిరాహార దీక్ష, రైల్‌రోకో కార్యక్రమాలు నిర్వహించాం. న్యాయవాదులు సైతం రోడ్లపై వంటావార్పు నిర్వహించారు. ఉద్యమాన్ని ఆపడానికి ఆంధ్ర నేతల ప్రయత్నాలు చాలా జరిగాయి. యూనివర్సిటీలో హాస్టల్స్ బంద్ చేస్తే సొంత డబ్బులతో భోజనం అందించాం. నాలుగో తరగతి
ఉద్యోగులకు జీతాలు ఆపితే వారికి సాయం చేశాం.
మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తండ్రి వేముల సురేందర్‌రెడ్డితో ధర్నా నిర్వహిస్తే, ఫైరింజన్ తీసుకొచ్చి నీళ్లు కొట్టారు. కేసీఆర్‌తో కలిసి ఢిల్లీకి వెళ్లి రెండు నెలలు అక్కడే ఉండి ఉద్యమ బాణిని ఢిల్లీలో వినిపించాం. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని ఢిల్లీలో చెప్తే అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. నాడు కేసీఆర్ చేపట్టిన దీక్షతో కేంద్రం హడలెత్తిపోయింది. తెలంగాణ ఏర్పాటుకు దిగివచ్చింది.
– బిగాల గణేశ్‌గుప్తా, అర్బన్ మాజీ ఎమ్మెల్యే
దీక్షదివస్ కార్యక్రమంతో కాంగ్రెస్ పతనం కావడం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వంలా మారింది. ఇప్పటివరకు రైతులకు రైతుబంధు కూడా ఇవ్వలేదు. బుడ్డర్ఖాన్ రేవంత్‌రెడ్డి చేష్టలతో ప్రజలు విసిగి పోయారు. పెన్షన్లు పెంచుతామని చెప్పిండ్రు. పెంచుడు కాదు కదా టైంకు పెన్షన్లు ఇవ్వకుండా సతాయిస్తుండ్రు. కల్యాణలక్ష్మి కింద ఇస్తామన్న తులం బంగారం ఎటుపోయింది. ఒక్క అభివృద్ధి పని చేపట్టింది లేదు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులకు శంకుస్థాపనలు చేసి ఫోజులు కొడుతుండ్రు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన రోడ్లు, భవనాలు తప్ప కాంగ్రెస్ ఏడాదిలో చేసిందేమీ లేదు. బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్ నాయకులని జీరో చేసేలా పని చేయాలి. కార్యకర్తలకు అండా ఉంటాం. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.
– బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే