బాన్సువాడ టౌన్, నవంబర్ 24: సమాజంలోని లోపాలను ఎత్తి చూపే ముందు మనలోని లోపాలను మనమే గుర్తించి స్వతాహాగా మార్పు తెచ్చుకొని మంచి మార్గంలో నడవాలని ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు అన్నారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మైదానంలో అయ్యప్ప సేవా సమితి, అయ్యప్ప నిత్యఅన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రవచన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్తీక మాసం, సనాతన ధర్మం అంశాలపై మాట్లాడారు.
దీక్షలో ఉన్నప్పుడు ఎలాంటి నియమాలతో ఉంటామో, దీక్ష లేనప్పుడు కూడా అలాగే నియమ నిష్టలతో ఉండాలని సూచించారు. శివ పార్వతుల సంతాన ఫలమే కార్తీక మాసమని, అందుకే కార్తీక మాసంలో శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారని, అయ్యప్ప మాల ధరిస్తారని తెలిపారు. మహిళలు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీ జ్ఙాన సరస్వతీ ఆలయ ధర్మకర్త పరిగె శంభురెడ్డి, రైతుబంధు సమితి మాజీ జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.