వీధి కుక్కల వీరంగానికి ఓ బాలుడు బలయ్యాడు. చెట్టు కింద నిద్రపోతున్న పది నెలల చిన్నారిపై శునకాల గుంపు దాడి చేసి దారుణంగా చంపేశాయి. అత్యంత దయానీయమైన ఈ ఘటన బోధన్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకున్నది. బాలుడిని దారుణంగా పీక్కుతిన్న ఘటనతో స్థానికులు కలవరపాటుకు గురయ్యారు.
నెల క్రితమే బోధన్ తట్టికోట్లో ఓ చిన్నారిని నోట కరుచుకుని వెళ్లిన ఉదంతం మరువక ముందే ఈ విషాదం చోటు చేసుకోవడంతో స్థానికులను భయాందోళనకు గురి చేసింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నిత్యం ఎక్కడో ఒకచోట చేసుకుంటున్న శునకాల దాడులను, అధికారుల వైఫల్యాలపై ‘నమస్తే తెలంగాణ’ మంగళవారమే ప్రత్యేక కథనం ద్వారా ఎత్తిచూపింది. దీనిపై చర్చ జరుగుతున్న సమయంలోనే ఓ బాలుడు కుక్కల దాడికి బలైపోవడం పెను విషాదం నింపింది.
-శక్కర్‌నగర్, సెప్టెంబర్ 10
చిన్నారిని పీక్కుతున్న కుక్కలు..
బోధన్‌లో యాచిస్తూ పొట్ట పోసుకునే ఓ మహిళకు పది నెలల కుమారుడు ఉన్నాడు. కొత్త బస్టాండ్ ప్రాంతమే ఆమెకు ఆవాసం. సోమవారం రాత్రి బాలుడు నిద్రపోగా, ఓ చెట్టు కింద బాలుడ్ని పడుకోబెట్టిన ఆమె పని మీద వెళ్లింది. కాసేపటి తర్వాత వచ్చి చూడగా చిన్నారి కనిపించలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా దొరకక పోవడంతో ఎవరైనా కిడ్నాప్ చేశారని భావించిన ఆ తల్లి.. మంగళశారం ఉదయమే పోలీసులకు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పట్టణ సీఐ వెంకటనారాయణ తన సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు.
బాలుడు అదృశ్యమైన ప్రాంతాన్ని జల్లెడ పడుతుండగా, మంగళవారం తెల్లవారుజామున కుక్కలు చిన్నపిల్లాడ్ని నోట పట్టుకుని వెళ్లినట్లు ఓ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. అతడు చెప్పిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా, అక్కడక్కడ మాంసపు ముద్దలు లభ్యమయ్యాయి. అవి చిన్నారి అవయవాలుగా గుర్తించి, వాటిని సేకరించి బోధన్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
భయాందోళనలో స్థానికులు
చిన్నారిని వీధికుక్కలు చిదిమేసిన ఘటన బోధన్‌లో కలకలం రేపింది. ఇప్పటికే శునకాల బెడదతో అల్లాడిపోతున్న స్థానికులు తాజా విషాదం నేపథ్యంలో వణికి పోతున్నారు. ఇటీవలే తట్టికోట్ ప్రాంతంలో ఓ బాలుడ్ని కుక్కల గుంపు మెడ పట్టుకుని ఎత్తుకెళ్తుండగా అడ్డుకున్న గర్భిణితో పాటు పలువురిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ ఉదంతం మరిచిపోక ముందే మరో బాలుడు కుక్కలకు ఆహారంగా మారడం స్థానికంగా తీవ్ర భయాందోళనను రేకెత్తించింది.
మరోవైపు, కుక్కల బెడద గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న తట్టికోట్ ఘటన సమయంలోనే మున్సిపల్ అధికారులు స్పందించి ఉంటే ఇప్పుడు ఈ చిన్నారి బలయ్యే వాడే కాదని చెబుతున్నారు. పది నెలల బాలుడు కుక్కలకు ఆహారంగా మారిన ఘటన మున్సిపల్ కమిషనర్‌కు, అధికారులకు తెలియక పోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శునకాలు దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నా బల్దియా వాళ్లకు సమాచారం కూడా లేదని చెప్పడంపై మండిపడ్డారు.
ఈ ఉదంతంపై బోధన్ మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణను వివరణ కోరగా, బోధన్‌లో కుక్కల బెడద తగ్గించేందుకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపారు. నిజామాబాద్‌లో కుక్కల బెడద నివారణ చర్యలు చేపట్టారని, బోధన్‌లోనూ అలాగే చేయాలని నివేదించామన్నారు. త్వరలోనే బోధన్‌లోని శునకాలను తీసుకెళ్లి వాటికి స్టెరిలైజేషన్ చేస్తారని తెలిపారు.