బోధన్, డిసెంబర్ 21: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని రాకాసీపేట్ గౌడ్స్కాలనీకి చెందిన శంకర్‌గౌడ్, నీరజ దంపతుల కుమారుడు పంజాల నీరజ్గౌడ్ (23) అమెరికాలోని న్యూ హెవెన్ సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు.
తన స్నేహితుడు శ్రీధర్‌తో కలిసి ఈ నెల 16న బ్రిడ్జిపోర్టు ప్రాంతానికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో దట్టమైన పొగమంచు ఆవరించడంతో కారు అదుపు తప్పి పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని దవాఖానకు తరలిస్తుండగా, నీరజ్గౌడ్ మార్గమధ్యంలో మృతి చెందగా, శ్రీధర్ ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.